అంకారా: రక్షణ సంస్థపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా తుర్కియే బుధవారం ఇరాక్, సిరియాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులకు దిగింది. కుర్దిష్ మిలిటెంట్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేపట్టింది. ఇరాక్, సిరియాల్లోని 30 వరకు కుర్దిష్ స్థావరాలను ధ్వంసం చేసినట్టు టర్కిష్ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. తుర్కియేలోని ఏరోస్పేస్, రక్షణ కంపెనీ ‘టీయూఎస్ఏఎస్’పై జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు చనిపోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తుర్కియే, ఇరాక్, సిరియాలపై ప్రతీకార దాడులకు దిగింది. ‘ఉగ్రదాడితో సంబంధమున్న వాళ్లలో అందర్నీ అంతమొందించే వరకు వాళ్లను వెంబడిస్తాం’ అని తుర్కియే హోం మంత్రి యెరిలికయ చెప్పారు.
ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్, హెజ్బొల్లా, ఇరాన్ యుద్ధాలతో ప్రపంచం అట్టుడుతుకుతుంటే తాజాగా ఇరాక్, సిరియాపై తుర్కియే వైమానిక దాడులు చేయడం ఆందోళన కలిగిస్తున్నది. ఉద్రిక్తతలు ముదిరి ఇది మరో యుద్ధానికి దారితీస్తుందా? అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, తైవాన్‌పై చైనా దుందుడుకు చర్యలకు దిగుతుందటం, ఉత్తరకొరియా-దక్షిణకొరియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం కూడా కలవరపరుస్తున్నది.