టర్కీలో వింత ఘటన
అంకారా, సెప్టెంబర్ 29: ‘నీలోని మనిషిని వెతుకు’.. ఆధ్యాత్మిక బోధనల్లో తరుచూ వినిపించే ఈ మాటను ఓ 50 ఏండ్ల వ్యక్తి ఇంకో విధంగా పాటించాడు! మద్యం మత్తులో తనెవ్వరో మరిచిపోయి.. తన గురించి తానే వెదికాడు. ఈ వింత ఘటన టర్కీలో ఇటీవల జరిగింది. బేహాన్ ముట్లు అనే వ్యక్తి స్నేహితులతో కలిసి అడవిలో ట్రెక్కింగ్‌కి వెళ్లాడు. మార్గమధ్యలో మందుకొట్టి తప్పిపోయాడు. స్నేహితుడి జాడను కనిపెట్టలేకపోయిన మిగతా మిత్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన ముట్లు ఫొటో ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో పేరు మాత్రమే చెప్పి వెనుదిరిగారు. దీంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ‘ముట్లు..’ అంటూ కేకలు పెట్టారు. అయితే, పోలీసులు ఎవరి గురించో వెదుకుతున్నారని మద్యం మత్తులో భ్రమపడిపోయిన ముట్లు.. వారి బృందంలో చేరి గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. ఇంతలో కుటుంబసభ్యులు ముట్లు ఫొటోను పోలీసులకు ఇచ్చారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు నోరెళ్లబెట్టారు.