హనుమకొండ, అక్టోబర్ 4 : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్యం అందించేందుకు అమలుచేస్తున్న ఈహెచ్ఎస్(ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) పథకం వారికి భరోసానివ్వడం లేదు. ప్రైవేట్ దవాఖానల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందక ప్రాణాలు గ్యారెంటీ లేకుండా పోతున్నది. తాజాగా ఆదివారం వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా ఇలాంటి పరిస్థితే ఎదురై చివరికి మృత్యువాతపడటం కలకలం రేపింది.
కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల కథనం ప్రకారం.. వరంగల్ దేశాయిపేట ప్రాంతానికి చెందిన సౌరం వెంకటేశ్వర్లు(74) పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్ పనిచేసి 2010లో ఉద్యోగ విరమణ పొందారు. ఆదివారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు తెల్లవారుజామున సుమారు 4 గంటలకు హంటర్‌రోడ్డులోని మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈహెచ్ఎస్ కార్డు ఉన్నప్పటికీ, ఆ కార్డుపై తాము చికిత్స చేయబోమని యాజమాన్యం స్పష్టంచేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
చికిత్స ప్రారంభించాలంటే రూ.50 వేలు ముందుగా చెల్లించాలనడంతో విధిలేక ఆ మొత్తాన్ని చెల్లించడంతో చికిత్స ప్రారంభించారని చెప్పారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం సాయంత్రం వెంకటేశ్వర్లు మృతిచెందినట్టు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే చికిత్సకు సంబంధించి మరో రూ.40 వేలు చెల్లించాల్సి ఉన్నదని, అవి చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తామని యాజమాన్యం చెప్పినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన పెన్షనర్లు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. వెంకటేశ్వర్లు మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ, హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ కందుకూరి దేవదాసు, టీపీటీఏ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్ డిమాండ్ చేశారు.
ఈహెచ్ఎస్ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ఈహెచ్ ఎస్ కార్డు ఉన్నా ప్రైవేట్ హాస్పిటళ్లలో వైద్యం అందకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. న్నాయి. పెన్షనర్లు, ఉద్యోగులకు ఇబ్బందులు కలిగిస్తున్న వైద్య విధానాన్ని ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈహెచ్ ఎస్ కార్డుపై అన్ని దవాఖానల్లో నగదు రహిత వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏసు ఓం బ్రహ్మం, ఎండీ అబ్దుల్ అలీమ్, సమ్మయ్య, సుధీర్‌బాబు, శంకర్రావు, శంకర్ లింగం, శ్రీమన్నారాయణచారి, సురేశ్, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.