Turkey : టర్కీ ప్రజలకు తీపి కబురు.. ఉద్యోగుల కనీస వేతనాన్ని ఏకంగా 55 శాతం పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నాడు. దాంతో ఉద్యోగులకు నెలకు 8,500 లీరాలు (455 డాలర్లు) లభించనున్నాయి. 2023 జనవరి నుంచి ఈ పెంపు వర్తించనుందని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్డోగాన్ రాజధాని అంకారాలో గురువారం వెల్లడించారు. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్డోగాన్ నిర్ణయం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాది జూలైలో పెంచాలి అనుకున్న దానికంటే 55 శాతం ఎక్కువ. జనవరి వేతనంతో పోల్చితే నూరు శాతం. అంతేకాదు ఏడాది కాలంలో కనీస వేతనాన్ని పెంచుతామని ఆయన తెలిపారు. అయితే.. ఈ విషయమై ఉద్యోగులు, కంపెనీలు ఇంకా ఒక ఒప్పందానికి రాలేదని ఎర్డోగాన్ చెప్పారు. వేతనం పెంపుతో మూడొంతుల మంది కార్మికులకు మేలు జరగనుందని టర్కీ కార్మిక శాఖ మంత్రి తెలిపారు.
మరో ఆరు నెలల్లో టర్కీలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఆర్థిక మాంద్యం కారణంగా టర్కీ కరెన్సీ లీరా విలువ పడిపోయింది. దాంతో ప్రజలు జీతాలు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఎర్డోగాన్ ప్రభుత్వాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఉద్దేశంతో ఎర్డోగాన్ వేతనాల పెంపు నిర్ణయం తీసుకున్నారు. టర్కీ 12వ అధ్యక్షుడిగా ఎర్డోగాన్ 2014లో బాధ్యతలు చేపట్టారు. 2003 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవంలందించారు. అంతేకాదు ఇస్తాంబుల్ మేయర్‌గానూ ఆయన పనిచేశారు.