Tulsi Gabbard : భారతదేశంలో హోలీ పండుగను కొద్దిలో మిస్ కావడం తన దురదృష్టమని అమెరికా నేషనల్ ఇంటెలిజన్స్ విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత పర్యటనకు వచ్చిన ఆమె.. మరో రెండు రోజులు ముందుగా తన టూర్ ప్లాన్ చేసుకుని ఉంటే హోలీ వేడుకల్లో పొల్గొనేదాన్నని అన్నారు.
దేశ ప్రజలు గత శుక్రవారం దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ పండుగ సంబురాలు చేసుకున్నారు. హిందూ సాంప్రదాయాలను పాటించే తులసి గబ్బార్డ్ పండుగ జరిగిన రెండు రోజులకే భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఆమెను హోలీ గురించి ప్రశ్నించగా.. హోలీ ఒక అద్భుతమైన పండుగ అని, కలర్ ఫుల్ పండుగ అని చెప్పారు. తాను హోలీ పండుగ సంబురాల్లో పాల్గొనలేకపోవడం తన దురదృష్టమని అన్నారు.
హవాయ్‌లోని తమ ఇంటి దగ్గర అలోహా (Aloha) అని ఒకరినొకరు పలకరించుకుంటారని, భారత్‌లో నమస్తే (Namaste) అని పలకరించుకుంటారని, పలుకరింపునకు వాడే పదం వేరైనా ఉద్దేశం మాత్రం ఒకటేనని అన్నారు. తన వ్యక్తిగత విషయానికి వస్తే ఈ పలకరింపు అనేది చాలా అర్ధవంతమైనది, చాలా ఆచరణాత్మకమైనది అని వ్యాఖ్యానించారు. కాగా తులసి గబ్బార్డ్ తల్లి అమెరికాలో జన్మించారు. ఆ తర్వాత హిందూ మతాన్ని స్వీకరించారు. హిందూ మత సంప్రదాయాలను పాటించారు.
తల్లి బాటలోనే తులసి గబ్బార్డ్ కూడా హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. తులసి గబ్బార్డ్ పేరులోని తులసి అనే పదం హిందూ మతం అత్యంత పవిత్రంగా చూసే ఒక మొక్క పేరు. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి హిందూ అమెరికన్ తులసి గబ్బార్డ్. కాంగ్రెస్‌లో ప్రమాణస్వీకారం సందర్భంగా కూడా గబ్బార్డ్ హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేశారు. హవాయ్‌కి చెందిన సినిమాటోగ్రాఫర్ అబ్రహమ్ విలియమ్స్‌ను ఆమె హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. గత నెలలోనే ఆమె అమెరికా నేషనల్ ఇంటెలిజన్స్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.