Trump Signature : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చరిత్ర సృష్టించనున్నారు. అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని అధ్యాయానికి అధ్యక్షుడు ట్రంప్ నాంది పలుకబోతున్నారు. త్వరలో ట్రంప్ సంతకం ఉన్న డాలర్ నోట్లను విడుదల చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ (Finance Minister) స్కాట్ బెసెంట్ (Scott Bessent) తెలిపారు. అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వ్యక్తి సంతకంతో కరెన్సీ నోట్ల (Currency Notes) ను ముద్రించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కొత్తగా ముంద్రించబోయే అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకంతోపాటు ఆ దేశ ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ సంతకం కూడా ఉండనుంది. ఈ మార్పులతో వచ్చే జూన్లో మొదటగా 100 డాలర్ల నోటును విడుదల చేయనున్నట్టు బెసెంట్ తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ‘ట్రంప్ సంతకంతో డాలర్ నోట్లను విడుదల చేస్తాం. ఈ ఏడాది అమెరికా జరుపుకోనున్న 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. దేశ చరిత్రాత్మక విజయాలను స్మరించుకునేందుకు ఇదో అద్భుత మార్గం’ అని బెసెంట్ చెప్పారు.
అమెరికా ట్రెజరర్ బ్రాండెన్ బీచ్ కూడా ఈ కొత్త విధానానికి మద్దతు పలికారు. ట్రంప్ ఈ గౌరవానికి పూర్తిగా అర్హులని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా ట్రెజరర్, ట్రెజరీ సెక్రెటరీల సంతకాలతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. 1861 నుంచి ఈ విధానం కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది జూలై 4న అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రంప్ చిత్రం ఉన్న 24 క్యారెట్ల బంగారు నాణేన్ని కూడా విడుదల చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు గత నెలలోనే ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఆమోదం తెలిపింది.