కనానాస్కిస్ (కెనడా), జూన్ 18 : భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపింది తానేనని పునరుద్ఘాటించారు. ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ.. ట్రంప్‌తో పేర్కొన్నట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్న కాసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన వినతి మేరకు తాము ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశామే తప్ప అమెరికా మధ్యవర్తిత్వం, లేదా ఆ దేశ వాణిజ్య ఒప్పందం ప్రతిపాదన వల్ల కాదని ట్రంప్‌కు స్పష్టం చేశారు. 35 నిమిషాల పాటు ట్రంప్ తో ఫోన్లో మా ట్లాడిన ప్రధాని ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలను అగ్రరాజ్య అధినేతకు వివరించారు. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన తర్వాత ట్రంప్ తో మోదీ సంభాషించడం ఇదే మొదటిసారి.
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్టు ట్రంప్ పునరుద్ఘాటించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ‘నేను యుద్ధాన్ని ఆపాను.. నేను పాకిస్థాన్‌ను ప్రేమిస్తున్నాను. మోదీతో నిన్న రాత్రి మాట్లాడాను. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. అయితే నేనే పాకిస్థాన్-భారత్ మధ్య యుద్ధాన్ని ఆపాను’ అని ట్రంప్ బుధవారం మీడియాతో పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ ఫోన్ సంభాషణను కాంగ్రెస్ పార్టీ ‘టిపుల్ షాక్’గా అభివర్ణించింది. ప్రభుత్వం దానిని ఒక రాజనీతి విజయంగా పేర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వానికి తిరుగులేని షాకేనని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ఉసిగొల్పేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మునీర్ వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో బుధవారం లంచ్ చేస్తున్నారన్నారు. అందుకే ట్రంప్ జీ7 సమావేశాన్ని ఒక రోజు ముందుగానే రద్దు చేసుకున్నారా? ట్రంప్ తో సంభాషణలో మోదీ ఈ విషయాన్ని ఎత్తారా? అని జైరాం రమేశ్ ప్రశ్నించారు.