న్యూయార్క్ : అమెరికా గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్(Green Card Lottery)ను తాత్కాలికంగా రద్దు చేశారు. తాజాగా బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటనకు పాల్పడిన వ్యక్తి ఆ లాటరీ పద్ధతిలోనే అమెరికాలోకి ఎంటర్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ పద్ధతిని సస్పెండ్ చేస్తూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. వివిధ దేశాలకు చెందిన సుమారు 50 వేల మందికి లాటరీ పద్ధతిలో గ్రీన్ కార్డు జారీ చేస్తుంటారు. ట్రంప్ ఆదేశాల ప్రకారం గ్రీన్ కార్డు లాటరీ వ్యవస్థను తాత్కాలికంగా రద్దు చేయాలని అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసు శాఖకు లేఖ పంపినట్లు హోంశాఖ మంత్రి క్రిస్టిన్ నియోమ్ తన ఎక్స్ పోస్టులో తెలిపారు. పోర్చుగీసు జాతీయుడైన క్లాడియో నీవస్ వాలెంటిన్ .. ఇటీవల బ్రౌన్ వర్సిటీలో కాల్పులకు పాల్పడ్డాడు. ఆ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మరణించగా, 9 మంది గాయపడ్డారు. ఎంఐటీ ప్రొఫెసర్ కూడా హతమయ్యాడు. 2017లో నీవస్కు పర్మినెంట్ రెసిడెన్సీ వచ్చింది.