ఆదివారం 29 మార్చి 2020
International - Feb 19, 2020 , 09:56:53

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌ ప్రకటన

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌ ప్రకటన

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న విషయం విదితమే. ఈ పర్యటనలో భాగంగా భారత్‌, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు అని అందరూ భావించారు. కానీ ఈ ఒప్పందం ఇప్పట్లో లేకపోవచ్చు. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. భారత్‌తో పెద్ద ఒప్పందాన్ని ఆదా చేస్తున్నానని డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు ఒప్పందం కుదురుతుందో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. వాణిజ్య అంశాల్లో భారత్‌ తమతో సరిగ్గా వ్యవహరించడం లేదని వెల్లడించారు. మున్ముందు అయితే భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం తప్పక ఉంటుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే అమెరికా వాణిజ్య ప్రతినిధి లైట్‌హైజర్‌.. భారత్‌తో వాణిజ్య చర్చలు జరిపారు. ట్రంప్‌ పర్యటన బృందంలో లైట్‌హైజర్‌ లేరని తెలుస్తోంది. లైట్‌హైజర్‌ లేకపోవచ్చన్న వార్తలు.. ఒప్పందం ఇప్పట్లో కుదిరే అవకాశం లేదన్న ట్రంప్‌ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. 

ప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టమని ట్రంప్‌ తెలిపారు. ఎయిర్‌పోర్టు, స్టేడియానికి మధ్య 70 లక్షల మంది స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని మోదీ తనతో చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ట్రంప్‌ పర్యటించనున్నారు. సబర్మతిలోని గాంధీ ఆశ్రమాన్ని కూడా ట్రంప్ సందర్శించే అవకాశం ఉంది. 

ఈ నెల 24న భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకోనున్న ఆయన అక్కడ మూడు గంటలు గడపనున్నారు. దీంతో ట్రంప్ 3గంటల పర్యటన కోసం విజయ్ రూపాణి సర్కార్ రూ. 100కోట్లు వెచ్చిస్తోంది. అహ్మదాబాద్ నగర పాలక సంస్థ, అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్రం మరో రూ. 14కోట్లు అందజేయనుంది. కొత్త రోడ్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతుకు రూ. 80 కోట్లు కేటాయించగా.. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక ట్రంప్ భద్రతకు రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు అధికారులు. మోడీ, ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు మరో రూ. 4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రోడ్ షోకు సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.


logo