న్యూయార్క్, ఆగస్టు 16: రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని కొనసాగిస్తున్న దేశాలపై అదనపు సుంకాలు విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్- ట్రంప్ చర్చలు విఫలమైన పక్షంలో భారత్‌పై అమెరికా ప్రభుత్వం మరిన్ని అదనపు సుంకాలు విధించవచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పుతిన్‌తో భేటీ కోసం అలాస్కా బయల్దేరినప్పుడు ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు తన చమురు కస్టమర్ ఒకరిని కోల్పోయారు.
భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో 40 శాతం చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. చైనా కూడా భారీ స్థాయిలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. అదనపు ఆంక్షలు లేదా అదనపు సుంకాలు నేను విధిస్తే ఆ దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. చెయ్యాలనుకుంటే నేను చేస్తాను. ఒకవేళ చెయ్యకూడదనుకుంటే చెయ్యను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతీయ దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకాలు ఆగస్టు 6న అమలులోకి వచ్చాయి. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా ప్రభుత్వం భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకం ఆగస్టు 27న అమలులోకి రానున్నది. రష్యా ఓ కస్టమర్‌ని కోల్పోయిందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు.