న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అందానికి 79 ఏళ్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిదా అయ్యారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ట్రంప్.. మెలోనీ అందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఈజిప్టులో సోమవారం జరిగిన గాజా శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ఏకైక మహిళా నాయకురాలు మెలోనీని బ్యూటిఫుల్ యంగ్ వుమెన్ అంటూ ప్రశంసించారు. ఆ మాట నేను అనడానికి వీల్లేదు. ఎందుకంటే మామూలుగా అయితే ఆ మాటతో నా రాజకీయ జీవితం ముగిసిపోతుంది అంటూ ట్రంప్ చమత్కరించారు. అమెరికాలో ఓ మహిళనుద్దేశించి అందం అన్న పదాన్ని ఉపయోగిస్తే దాంతో మన రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే. మీరు ఏమీ అనుకోరు కదా? ఎందుకంటే మీరు చాలా అందంగా ఉన్నారు అని తన వెనకునే నవ్వుతూ నిలుచున్న మెలోనీని చూస్తూ ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు.
మెలోనీని చూసి నవ్వుతూ ఆమె వద్దకు వెళ్లిన తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్, విమానం దిగి వస్తున్న మిమల్ని చూశాను. మీరు చాలా బాగున్నారు. అయితే మీ చేత స్మోకింగ్ మాన్పించాల్సి ఉంటుంది అంటూ చమత్కరించారు. సమీపంలోనే ఉన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ నవ్వుతూ వారి వద్దకు వచ్చి అది అసాధ్యం అంటూ జవాబిచ్చారు.