న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి క్యూబాపై తన వ్యతిరేకతను బయటపెట్టారు. క్యూబా ద్వీపాన్ని తక్షణమే అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లోగల ఫోరమ్ క్లబ్లో శుక్రవారం రాత్రి ఒక ప్రైవేట్ విందు సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ముందుగా ఇరాన్లో తన పనిని పూర్తి చేసి ఆ తర్వాత తన దృష్టిని క్యూబాపై మళ్లిస్తానని చెప్పారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనను కేవలం సాధారణ బెదిరింపుగా పరిగణించలేమని నేతలు అంటున్నారు.
క్యూబా విషయంలో వైట్ హౌస్ నుంచి బెదిరింపులతోపాటు ఆర్థిక ఆంక్షలు, సైనిక హెచ్చరికలను ట్రంప్ ప్రకటన సూచిస్తున్నది. క్యూబాపై అమెరికా ఇప్పటికే ఆర్థిక ఒత్తిడికి పాల్పడుతున్నది. ఇంధనం, మైనింగ్, రక్షణ, ఆర్థిక సేవలతో సహా క్యూబా ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలను విస్తరించింది.