వాషింగ్టన్/ఇస్లామాబాద్, ఏప్రిల్ 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్‌తో సీజ్ఫైర్ ఒప్పందాన్ని పొడిగించబోనని మంగళవారం ప్రకటించిన ఆయన.. గంటల వ్యవధిలోనే మాట మార్చారు. మధ్యవర్తి పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఏడు వారాల యుద్ధాన్ని ముగించడానికి ఒక ఐక్య ప్రతిపాదనతో రావడానికి ఏకాభిప్రాయం కొరవడిన ఇరాన్ నాయకత్వానికి సమయం ఇచ్చేందుకే ఈ చర్య అని పేర్కొన్నారు. ఏప్రిల్ 8న ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగిసిపోనున్న తరుణంలో అమెరికా నుంచి వెలువడిన ఈ నాటకీయ ప్రకటనను పాకిస్థాన్‌కు చెందిన అగ్ర నాయకత్వం స్వాగతించింది.
ఈ పొడిగింపుతో ఇరాన్ ప్రతినిధులతో శాంతి చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్ రావలసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటన వాయిదాపడింది. వాన్స్, అమెరికా ప్రత్యేక దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నెర్ మంగళవారం ఇస్లామాబాద్‌కు ప్రయాణించవలసి ఉంది. తమ ప్రతినిధి బృందం పాక్ పర్యటన ఈ రోజు(మంగళవారం) లేదని వైట్ హౌస్ ప్రకటించింది.
ఇరాన్ ప్రభుత్వం ఊహించిన విధంగానే రెండుగా చీలిపోయిందన్న వాస్తవం ఆధారంగా, ఇరాన్ నాయకులు, వారి ప్రతినిధులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చేంత వరకు ఇరాన్‌పై అమెరికా దాడిని నిలిపివేయాలని పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాము అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే చర్చల కోసం ఒక ఏకీకృత ప్రతిపాదనతో ఇరాన్ నాయకత్వం వచ్చేంత వరకు మాత్రమే ఇరాన్‌పై తమ దాడి ఆగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ఓడరేవులపై తమ ఆర్థిక అడ్డగింపు కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు.
అమెరికా చర్యను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా తప్పుపట్టారు. ఇరాన్ ఓడరేవులను అడ్డుకోవడం యుద్ధ చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఆయన పేర్కొన్నారు. ఆంక్షలను ఎలా తొలగించుకోవాలో, తన ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో, బెదిరింపులను ఎలా ప్రతిఘటించాలో ఇరాన్‌కు తెలుసుఅని సోషల్ మీడియో పోస్టులో ఆయన పేర్కొన్నారు. ఆసియాలో ఇరాన్ ముడిచమురును స్మగ్లింగ్ చేస్తున్నందుకు ఆంక్షలు విధించిన ఒక చమురు ట్యాంకర్‌లోకి తమ సేనలు ప్రవేశించాయని అమెరికా ఇదివరకు ప్రకటించింది. ఎటువంటి ఘర్షణ లేకుండా ఎం/టీ టిఫానీ చమురు ట్యాంకర్‌లోకి అమెరికా దళాలు ప్రవేశించాయని పెంటగాన్ తెలిపింది. ఆ నౌక శ్రీలంక, ఇండోనేషియా మధ్య మంగళవారం హిందూ మహాసముద్రంలో ఉన్నట్లు షిప్ ట్రాకింగ్ డాటా ద్వారా గుర్తించినప్పటికీ అమెరికా సైన్యం మాత్రం నౌక ఆచూకీ వెల్లడించలేదు. ఆంక్షలు ఎదుర్కొంటున్న నౌకలకు అంతర్జాతీయ జలాలు ఆశ్రయం కాదని పెంటగాన్ పేర్కొన్నది.
అన్ని పక్షాలకూ ఆమోదయోగ్యమైన ముసాయిదా ప్రతిపాదనను రూపొందించే లక్ష్యంతో వాషింగ్టన్, ఇస్లామాబాద్, టెహ్రాన్‌లోని అధికారుల మధ్య రోజుల తరబడి జరిగిన తీవ్రమైన దౌత్య కార్యకలాపాలకు ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపు ప్రకటనతో తెరపడింది. మంగళవారం ఉదయం విట్కాఫ్, కుష్నెర్ మియామీ నుంచి ఇస్లామాబాద్‌కు బయల్దేరవలసి ఉండగా అదనపు సమావేశాలలో చేరవలసిందిగా వైట్ హౌస్ నుంచి వారికి ఆహ్వానం అందింది. ఇస్లామాబాద్‌కు పయనం అవ్వాల్సిన వాన్స్ కూడా వాషింగ్టన్ చర్చలలో పాల్గొంటున్నారు. కాల్పుల విరమణను పొడిగించాలన్న నిర్ణయం ట్రంప్ వైఖరిలో మార్పును సూచించింది. బుధవారంలోగా ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై తాను బాంబులు వేయబోతున్నానంటూ అంతకుముందు మంగళవారం ట్రంప్ ప్రకటించారు.
అమెరికాతో చర్చల పునరుద్ధరణకు ఇరాన్ స్పష్టమైన ముందస్తు షరతు విధించింది. హొర్ముజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని ముగిస్తేనే చర్చల్లో తాము పాల్గొంటామని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి సయీద్ ఇరవని ప్రకటించారు. చర్చలు ముందుకు కదలాలంటే అమెరికా ముందుగా తన కాల్పుల విరమణ ఉల్లంఘనలను నిలిపివేయాల్సి ఉంటుందని ఇరవని స్పష్టం చేసినట్లు యూఎన్ ప్రధాన కార్యాలయం వద్ద ఇరావ్టో రడ్లా న్యూస్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ తస్నీమ్ వార్తా సంస్థ పేర్కొన్నది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఆయన అభివర్ణిస్తూ ముందుగా ఈ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తాము కోరినట్లు చెప్పారు. దాన్ని ఎత్తివేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు తమకు సంకేతాలు అందాయని ఆయన చెప్పారు. దిగ్బంధనం తొలగిన వెంటనే ఇస్తాంబుల్‌లో రెండవ విడత చర్చలు ప్రారంభమవుతాయని తాను భావిస్తున్నట్లు ఇరవని చెప్పారు. సైనిక దాడిని తాము ప్రారంభించలేదని, యుద్ధాన్ని వారే ప్రారంభించారని ఆయన అమెరికాను ఉద్దేశించి అన్నారు. చర్చల ద్వారా సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనాలని వారు భావిస్తే తాము అందుకు సిద్ధమని, అలా కాకుండా యుద్ధమే వారు కోరుకుంటే దానికి కూడా ఇరాన్ సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా-ఇరాన్ మలివిడత చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల చర్చలకు సంబంధించి ‘గుడ్ న్యూస్’ వింటారని చెప్పారు. తదుపరి శాంతి చర్చల్లో ఇరాన్ పాల్గొంటుందా? లేదా? తెలియని పరిస్థితులు ఉండగా, మరోవైపు ట్రంప్ నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం గమనార్హం. శుక్రవారంలోగా శాంతి చర్చలు మొదలవుతాయని ట్రంప్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులను ఉటంకిస్తూ.. చర్చలు తిరిగి ప్రారంభం అయ్యేందుకు సానుకూల వాతావరణం ఉందని ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం పేర్కొన్నది.