న్యూయార్క్, ఏప్రిల్ 26: కొండంత రాగం తీసి లల్లాయి పాట పాడిన చందంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఉల్లంఘనల పేరిట అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ, వారికి దేశ బహిష్కరణ విధిస్తూ బెదరగొట్టిన ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గి వారికి శుభవార్త చెప్పింది.
విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నామని, కొత్తగా వీసాల రద్దును చేపట్టమని హామీనిచ్చింది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు 187 కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు చెందిన 1200 మందిపై వేటు వేసింది. తమ బహిష్కరణను సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు అంతర్జాతీయ విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోర్టులను ఆశ్రయించారు.