Donald Trump : అమెరికా, ఇరాన్ (US-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పడానికి పాకిస్తాన్ (Pakistan) వేదికగా జరుగుతున్న రెండో విడత ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ (Islamabad) లో రెండు దేశాల ప్రతినిధులను ఒకే తాటిపైకి తీసుకురావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి (Pak Prime Minister) షాబాజ్ షరీఫ్ (Shabaz Sharif) చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇరాన్‌తో చర్చల్లేవని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ మీట్ లక్ష్యంగా జరిగిన కాల్పుల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పాకిస్తాన్ నాయకత్వంతో చర్చలు జరిపినప్పటికీ.. అమెరికా ప్రతినిధి బృందంతో నేరుగా కలవడానికి నిరాకరించారు. అమెరికా నౌకాదళం విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడమే తమ ప్రధాన షరతు అని స్పష్టం చేశారు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చల్లో పురోగతి లేకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌ల పాకిస్తాన్ పర్యటనను రద్దు చేశారు.
మొత్తం 18 గంటల ప్రయాణం వృథా అని, ఇరాన్ నాయకత్వంలో స్పష్టత లేదని ట్రంప్ విమర్శించారు. చర్చలు జరపాలంటే ఇక ఇరానే తమను సంప్రదించాలని సూచించారు. కాగా పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలుకడం కోసం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన తొలివిడత చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ట్రంప్ ప్రకటనతో విఫలమయ్యాయి.