Talking Tree | డబ్లిన్: ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. ‘టాకింగ్ ట్రీ’ అనే వినూత్న ప్రాజెక్టును చేపట్టడం ద్వారా మనుషులు నేరుగా వృక్షాలతోనే సంభాషించేందుకు వీలుకల్పించే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. చెట్ల నుంచి వెలువడే బయో ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను కృత్రిమ మేధస్సు (ఏఐ)తోపాటు అధునాతన సెన్సర్ల సాయంతో మానవ భాషగా మార్చడం ద్వారా పర్యావరణ సంరక్షణకు సరికొత్త దారులు తెరిచారు. ఈ టెక్నాలజీ ద్వారా నేలలోని తేమ, పీహెచ్ స్థాయి, గాలిలోని తేమ, ఉష్ణోగ్రత, సూర్యకాంతి తదితర పర్యావరణ అంశాలను ఈ సెన్సర్లు గుర్తిస్తాయి.
ఆ డాటాను చెట్టు నుంచి వెలువడే బయో ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌తో సమన్వయం చేస్తారు. తర్వాత ఆ సిగ్నల్స్‌ను ఏఐ సాయంతో మానవ భాషలోకి అనువదిస్తారు. తద్వారా వృక్షాలు తమ అనుభవాలను మనుషులకు తెలియజేసే వీలు కల్పించారు. పర్యావరణ సంరక్షణే ప్రధాన లక్ష్యంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతను శాస్త్రవేత్తలు ట్రినిటీ కాలేజీలోని 200 ఏండ్లనాటి ‘లండన్ ప్లేన్’ వృక్షానికి అనుసంధానించారు. అనంతరం ఓ వ్యక్తి ఆ చెట్టుతో సంభాషించగలిగాడు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.