Greece Wild Fire | కొన్ని రోజులుగా గ్రీస్‌లోని కొన్ని దీవుల్లో రగులుతున్న కార్చిచ్చుతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటలార్పేందుకు ఫైరింజన్ సిబ్బంది విమానాల సాయంతో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఓ విమానం కుప్పకూలింది. ఎవియా ప్లాటానిస్టోస్, కరిసోస్ట్ గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగిందని అగ్ని మాపక దళ శాఖ అధికారులు తెలిపారు. కైనడైర్ టైప్ వాటర్ బాంబర్ సాయంతో మంటలు ఆర్పేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు మీడియాకు చెప్పారు. విమానం కుప్పకూలినప్పుడు అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారన్నారు. దీవుల్లో దక్షిణ వైపు రగులుతున్న కార్చిచ్చును ఆర్పేస్తుండగా విమానం కూలిపోయిందని చెప్పారు. ఈ ప్రమాద తీవ్రత అంచనా వేయడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెలికాప్టర్ ఘటనా స్థలానికి చేరుకుందన్నారు.
రోజురోజుకు కార్చిచ్చు తీవ్రం కావడంతో గ్రీస్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నది. రోడ్స్ ద్వీపంలో మంటలు లోతట్టు ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో రోడ్స్, ఎవియా, కోర్పు దీవుల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిలో చాలా మంది పర్యాటకులే ఉన్నారు.
అననుకూల వాతావరణం వల్ల మంటలు ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితుల్లేవని అగ్ని మాపక దళ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మంటలు ఆర్పేయడానికి భారీగా అగ్నిమాపక దళ సిబ్బంది, విమానాలు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో గ్రీస్‌కు ఐరోపా యూనియన్‌తోపాటు టర్కీ, జోర్డాన్, ఇజ్రాయెల్, క్రొయేషియా చేయూతనిస్తున్నాయి.