Anshula Kapoor | ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె, నటుడు అర్జున్ కపూర్ సోదరి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్షులా కపూర్ వివాహ బంధంలో అడుగుపెట్టారు. తన ప్రియుడు, రచయిత రోహన్ థక్కర్‌ను ఆమె హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో సోమవారం (జూలై 6) అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. వివాహం అనంతరం అన్షులా కపూర్ సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలను పంచుకోగా, వాటిలోని ఓ ప్రత్యేకమైన క్షణం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
పెళ్లిలో అత్యంత భావోద్వేగభరితమైన సిందూర ధారణ వేడుకలో అన్షులా చెల్లెళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వరుడు రోహన్ థక్కర్ అన్షులా నుదుట సిందూరం దిద్దుతున్న సమయంలో ఆ ఆచారం సక్రమంగా జరిగేలా జాన్వీ, ఖుషీ ఇద్దరూ వధువు ఇరువైపులా నిలబడి సహాయం చేశారు. బ్రైడ్స్‌మెయిడ్స్‌గా వ్యవహరించిన వారి ఆప్యాయత, కుటుంబ బంధాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా, కపూర్ కుటుంబ అనుబంధానికి ఇది నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి ఫొటోలతో పాటు తన భర్త రోహన్ థక్కర్‌కు అన్షులా భావోద్వేగ సందేశాన్ని కూడా అంకితం చేశారు.
ఎందరో వ్యక్తులు, ఎన్నో ప్రదేశాలు, ఎన్నో సందర్భాలు ఉన్నా… చివరకు నువ్వే నా జీవిత భాగస్వామివయ్యావు. ప్రతి మలుపు, ప్రతి ఆశ్చర్యాన్ని దాటుకుని ఇప్పటికీ నువ్వే నా తోడుగా నిలిచావు. నా ఫేవరెట్ సంభాషణ, నా సురక్షితమైన స్థలం, నా జీవితంలో అత్యంత సులభమైన నిర్ణయం నువ్వే అంటూ ప్రేమను వ్యక్తం చేశారు. ఆమె పోస్ట్‌కు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వివాహ వేడుకకు కపూర్ కుటుంబ సభ్యులతో పాటు నటుడు అనిల్ కపూర్ తదితరులు హాజరయ్యారు. పెళ్లికి ముందు జరిగిన మెహందీ, చూడా వేడుకల్లో కూడా జాన్వీ, ఖుషీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సోదరి పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు వారు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభిమానులను ఆకట్టుకుంది.