వాషింగ్టన్: రష్యా నుంచి చమురు దిగుమతుల్లో కోతలు విధిస్తున్నదని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ భారత్‌పై అమెరికా (USA) మరింత ఒత్తిడి పెంచుతున్నది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ (Russian Oil) ఉక్రెయిన్‌తో యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నదని మరోమారు విమర్శించింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను ఆపాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్ మిల్లర్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనడాన్ని ఆపాలని ట్రంప్ స్పష్టం చెబుతున్నారని వెల్లడించారు.
‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఈ యుద్ధానికి నిధులు సమకూర్చడాని భారత్ కొనసాగించడం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇరుదేశాల చమురు వాణిజ్యం తమకు ఆశ్చర్యం కలిగించింది. రష్యన్ చమురు కొనుగోలులో భారత్ చైనాతో ముడిపడి ఉందని తెలిస్తే ప్రజలు షాక్ అవ గురవుతారు. అయితే ఇదే వాస్తవం’ అని వెల్లడించారు.
కాగా, అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లు, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ దాదాపు నిలిపివేసిందని రాయిటర్స్ వార్తాసంస్థ కథనం పేర్కొంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి భారతీయ చమురు కంపెనీలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేశాయని తెలిపింది. రాయితీలు తగ్గడం, సరకు రవాణాలో ఇబ్బందులు తలెత్తడమే ఇందుకు కారణమని వార్తాసంస్థ పేర్కొంది. రష్యా నుంచి ముడి చమురును 2022 నుంచి కొనుగోలు చేస్తున్నా మొట్టమొదటిసారి అతి తక్కువ రాయితీ ఇప్పుడే లభిస్తున్నదని, దీంతో రష్యా నుంచి కొనుగోళ్లను భారతీయ చమురు సంస్థలే నిలిపివేశాయని వార్తాసంస్థ పేర్కొంది. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.
రష్యా నుంచి ఇక ఎక్కువ కాలం చమురును భారత్ కొనుగోలు చేయదని వార్తలు వస్తున్నాయని, అయితే ఈ వార్తలలోని నిజానిజాలు తనకు తెలియవని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే జరిగితే మంచి విషయమేనని అన్నారు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూద్దామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. భారత చమురు అవసరాలకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఆధారంగా, అప్పటి అంతర్జాతీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేశారా లేదా అన్నది సూటిగా సమాధానం చెప్పలేదు.
భారత్‌పై మోయలేని భారం
అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాల దిగుమతులను భారత్ పూర్తిగా నిలిపివేసిన పక్షంలో భారత్ చమురు దిగుమతి ఖర్చులు ఏటా 1100 కోట్ల డాలర్లకు (దాదాపు 95 వేల కోట్లు) పెరుగుతాయని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద చమురు దిగుమతిదారైన భారత్ భారీ రాయితీతో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుని గణనీయ స్థాయిలో ప్రయోజనం పొందింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన దరిమిలా భారత్ రష్యా నుంచి తన కొనుగోళ్లను పెంచింది. ఈ యుద్ధానికి ముందు తన మొత్తం చమురు దిగుమతిలో భారత్ కేవలం 0.2 శాతం మాత్రమే రష్యా నుంచి కొనుగోలు చేసేది. 2022 తర్వాత ఇది 35 నుంచి 40 శాతానికి పెరిగింది.