మాస్కో: అగ్రదేశాలు అమెరికా, రష్యా(US-Russia Talks) మధ్య బంధం సరిగా లేని విషయం తెలిసిందే. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కోసం ప్రిపరేషన్ జరుగుతున్నది. సౌదీ అరేబియా వేదికగా ఆ ఇద్దరు నేతలు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ రెండు దేశాలకు చెందిన కీలకమైన వ్యక్తులు భేటీ కానున్నారు. పుతిన్, ట్రంప్ భేటీ కోసం వాళ్లు ప్రిపరేషన్ చేపట్టనున్నారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్లు.. మంగళవారం సౌదీలో జరిగే భేటీలో పాల్గొంటారు. అమెరికా అధికారులతో వాళ్లు చర్చించనున్నారు. అమెరికా, రష్యా రిలేషన్స్‌ను మళ్లీ పునరుద్దరించేందుకు చేపట్టాల్సిన అంశాలపై వాళ్లు చర్చిస్తారు. ఉక్రెయిన్ సెటిల్మెంట్ అంశంతో పాటు ఇద్దరు దేశాధ్యక్షుల భేటీ గురించి లోతుగా చర్చిస్తారు. అమెరికా దళానికి ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబ్ ప్రాతినిధ్యం వహించనున్నారు.
మరో వైపు ఉక్రెయిన్ యుద్ధం అంశంలో.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.. యురోప్ దేశాలతో భేటీ అవుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్ దేశాధినేతలు ఆ మీటింగ్‌కు హాజరయ్యారు. పారిస్‌లో ఈ మీటింగ్ జరుగుతున్నది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఉక్రెయిన్‌లో తమ దళాలను ఉంచనున్నట్లు బ్రిటీష్ ప్రధాని స్టార్మర్ తెలిపారు. జర్మనీ, స్వీడన్ కూడా తమ పీస్‌కీపింగ్ దళాల్ని ఉక్రెయిన్‌లోనే ఉంచనున్నట్లు చెప్పాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైంది. 46 వేల మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు జెలెన్స్కీ తెలిపారు.