జెరూసలేం, సెప్టెంబర్ 20: ఇజ్రాయెల్ – లెబనాన్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ పేలుళ్లు ఇజ్రాయెల్ పనేనని ఆరోపించిన హెజ్బొల్లా ప్రతిదాడులు తప్పవని హెచ్చరించిన తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుంటూ లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులకు దిగింది. మరోవైపు హెజ్బొల్లా సైతం ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. ఒకవైపు గాజాలో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం ముగుస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ – హెజ్బొల్లా మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తడం ఆందోళనకరంగా మారింది.
పరస్పరం దాడులు
లెబనాన్ రాజధాని బీరుట్‌పై గురువారం నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నది. దక్షిణ బీరుట్‌లోని జేమస్ స్ట్రీట్ ప్రాంతంలో ఓ భవనంపై జరిగిన దాడిలో అనేక మంది గాయపడ్డారు. క్ఫర్ కిలా పట్టణంలోని హెజ్బొల్లా శిబిరంపైనా దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఇబ్రహీం అఖిల్ సహా ఎనిమిది మంది మరణించారని, 59 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై శుక్రవారం 140 కత్యూషా రాకెట్లతో దాడి చేసినట్టు హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ వాయు రక్షణ కేంద్రాలతో పాటు సైనిక బ్రిగేడ్ కేంద్రంపై దాడి చేసినట్టు చెప్పింది. గోలన్ హైట్స్, సఫేర్, అప్పర్ గలిలీ ప్రాంతంలో హెజ్బొల్లా దాడి చేసినట్టు ఇజ్రాయెల్ నిర్ధారించింది. ఈ పరస్పర దాడుల్లో ఇరువైపులా భారీగానే ఆస్తినష్టం జరిగిందని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
యుద్ధం తప్పదు: ఇజ్రాయెల్
అక్టోబరు 8 నుంచి ఇజ్రాయెల్ – హెజ్బొల్లా మధ్య దాడులు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు యుద్ధం అంచుకు చేరాయి. పేజర్ల పేలుడు ఇజ్రాయెల్ చేసిన యుద్ధ ప్రకటనే అని హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ హస్సన్ నస్రల్లా వ్యాఖ్యానించగా, ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలను తిరిగి వారి ఇండ్లకు చేర్చేందుకు యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జాగ్ వ్యాఖ్యానించడం యుద్ధానికి ఇరువైపులా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. గాజా నుంచి పెద్ద ఎత్తున సైనికులను లెబనాన్ సరిహద్దు వైపు ఇజ్రాయెల్ మోహరిస్తున్నది. హెజ్బొల్లా కూడా యుద్ధానికి సన్నద్ధమవుతున్నది. గోలన్ హైట్స్, ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాల్లో గుమిగూడొద్దని, సురక్షిత ప్రాంతాలకు చేరువగా ఉండాలని ప్రజలకు ఇజ్రాయెల్ సూచించింది.