వాషింగ్టన్: గత ఏడాది అమెరికా సుమారు లక్ష వీసాల(US Visas)ను రద్దు చేసింది. దీంట్లో 8 వేల మంది విద్యార్థులు ఉన్నారు. నేర చరిత్ర ఉన్నవారి వీసాలను రద్దు చేసేందుకు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ కొన్నాళ్లుగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అమెరికాను సురక్షితంగా ఉండేందుకు నేర చరిత్ర కలిగినవారిని డిపోర్టు చేస్తామని ఆ దేశ పరిపాలనా శాఖ తన సోషల్ మీడియా పోస్టులో చెప్పింది. ఏడాది లోపే ట్రంప్ ప్రభుత్వం లక్ష మంది వీసాలను రద్దు చేసినట్లు స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు. నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారు, దోషులుగా తేలిన వారి వేలాది మంది విదేశీయుల వీసాలను రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. దొంగతనం, దాడులకు పాల్పడినవాళ్లు ఆ లిస్టులో ఉన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపినవారు కూడా వీసా రద్దు అయినవారిలో ఉన్నారు. ఫాక్స్ న్యూస్ ప్రకారం 2025లో లక్ష వీసాలను రద్దు చేయగా, అంతకుముందు 2024లో 40 వేల వీసాలను రద్దు చేశారు. ఎక్కువ బిజినెస్, టూరిస్టు వీసాలను రద్దు చేశారు.