Plane Crash | రష్యాలోని మాస్కో నగరంలో మరమ్మతులు పూర్తి చేసుకున్న ఓ విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది మరణించారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో ప్రయాణికుల్లేక పోవడం పెను ప్రమాదం తప్పిందన్నారు. గ్యాజ్ ప్రోమ్ ఏవియా విమానం మరమ్మతుల తర్వాత వ్నుకోవో విమానాశ్రయానికి బయలుదేరింది. అటుపై కొద్ది సేపటికే సమీపంలోని అడవిలో కుప్పకూలింది. అయితే, ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు రష్యా విమానయాన శాఖ అధికారులు చెప్పారు.
రష్యాకు చెందిన సుఖోయ్ సూపర్ జెట్ 100 విమానాలు 2011లో అందుబాటులోకి వచ్చినప్పుడు ఇది రష్యా పౌర విమానయాన పరిశ్రమ సాధించిన గొప్ప విజయం అని పేర్కొన్నారు. కానీ అధిక ఖర్చులతోపాటు తరచుగా మరమ్మతులకు గురి కావడంతో రష్యా విమాన యాన సంస్థలు గానీ, విదేశీ ఎయిర్ లైన్స్ గానీ ఈ విమానాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. 2012లో సుఖోయ్ సూపర్ జెట్ (ఎస్ఎస్జే 100) విమానం ఇండోనేషియాలో అగ్ని పర్వతాన్ని ఢీకొనడంతో 45 మంది, 2019లో మాస్కోలోని షెరెమెటివో విమానాశ్రయంలో మరో విమానం కూలిపోవడంతో 41 మంది చనిపోయారు.