Canada | న్యూఢిల్లీ, జనవరి 12: భారత్-కెనడా పౌరులకు సేవలందచేస్తున్న భారతీయ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్లు, కెనడాకు వలసవచ్చిన భారతీయ వృత్తి నిపుణులకు డబ్బుల కోసం బెదిరింపు ఫోన్ కాల్స్ పెరిగిపోతున్నాయి. ఇటువంటి ఘటనలు గ్రేటర్ టొరంటో ఏరియా(జీటీఏ), వాంకోవర్ ప్రాంతంలో వెలుగుచూశాయి.
సురక్షితంగా, సుస్థిరంగా ఉంటామన్న ఆశతో కెనడాకు వలస వచ్చిన నిపుణుల్లో ఈ ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. జనవరి 3న బ్రాంప్టన్‌లో నివసించే భారతీయ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ విక్రమ్ శర్మ ఇంటిపై మాస్కు ధరించిన ఓ షూటర్ పలుమార్లు కాల్పులు జరిపాడు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో శర్మ ఇంటిపైకి 8 నుంచి 9 బుల్లెట్లు దూసుకువచ్చాయని పంజాబీ భాషలో వెలువడే హ్యాష్‌ట్యాగ్ మీడియా సంస్థ తెలిపింది.
కాల్పుల అనంతరం 5 లక్షల డాలర్లు చెల్లించాలని డిమాండు చేస్తూ శర్మకు వాట్సాప్ కాల్ వచ్చింది. తాను అడిగిన డబ్బులు చెల్లించకపోతే తర్వాతి తూటా నీ శరీరంలోనే దిగుతుందని కాలర్ తనను బెదిరించినట్లు శర్మ చెప్పారు. ఈ ఘటనను దిగ్భ్రాంతికరంగా అభివర్ణించిన శర్మ ఇందుకోసం తాము కెనడా రాలేదని మీడియా సంస్థకు తెలిపారు. మూడేండ్ల క్రితం కెనడాకు వలస వచ్చిన శర్మ కుటుంబం గత వారం దేశాన్ని విడిచి భారత్‌కు తిరిగివెళ్లిపోయింది. ఇది శర్మ మాత్రమే ఎదుర్కొన్న అనుభవం కాదని, పలువురు భారతీయులకు ఇటువంటి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని హ్యాష్‌ట్యాగ్ మీడియా అధిపతి నితిన్ చోప్రా చెప్పారు.