Australia | కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకంగా ఆదివారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరుతో నిర్వహించిన ఆందోళనలో నిరసనకారులు ప్రధానంగా భారతీయులను లక్ష్యంగా చేసుకున్నారు. దేశ సాంస్కృతిక నిర్మాణానికి వారు ముప్పుగా మారారని ఆరోపించారు. పెద్దయెత్తున ఉన్న వలసవాదులకు వ్యతిరేకంగా దేశ రాజధాని సిడ్నీ సహా ప్రధాన నగరాలు, పట్టణాలలో ఆందోళన నిర్వహించారు. 5 నుంచి 8 వేల మంది ఆస్ట్రేలియా జాతీయ జెండాలు ధరించి సిడ్నీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. 100 ఏండ్లలో వచ్చిన గ్రీకులు, ఇటాలియన్ల కంటే, ఐదేండ్లలో వచ్చిన భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉందని వారు ఆరోపించారు. ఆ ర్యాలీ లక్ష్యం గురించి ఆందోళనకారుల గ్రూప్ శనివారం వెబ్సైట్లో వివరించింది.
ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఎప్పటికీ చేయలేనిది సాధించడం, సామూహిక వలసలను అంతం చేయాలని డిమాండ్ చేయడం తమ ర్యాలీ లక్ష్యం అని నిరసన బృందం శనివారం ఎక్స్‌లో పేర్కొంది. కాగా, నిరసనకారుల ఆందోళనకు ప్రతిగా శరణార్థుల హక్కుల రక్షణ సంఘం పేరుతో కొందరు ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా తీవ్రవాద ఎజెండాను వారు తీవ్రంగా నిరసించారు. వారి చర్య అసహ్యం, కోపాన్ని కలిగిస్తున్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఈ నిరసన ప్రదర్శనలను తాము వ్యతిరేకిస్తున్నట్టు కార్మిక శాఖ మంత్రి ముర్రే వాట్ తెలిపారు. వీటిని నియో-నాజీ సంస్థలు నిర్వహించిన, ప్రోత్సహించిన ఉద్యమమని ఆయన వ్యాఖ్యానించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేసే, సమాజాన్ని విభజించే ఇలాంటి ఆందోళనలను తాము ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.