న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)ను.. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ షూట్ చేశాడు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల సభలో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో.. క్రూక్స్ తన వద్ద ఉన్న గన్‌తో కాల్చాడు. అయితే ఆ గన్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్.. ట్రంప్ కుడి చవిని గాయపరిచింది. తృటిలో ట్రంప్ ప్రాణాలు దక్కించుకున్నారు.
ట్రంప్‌ను కాల్చిన క్రూక్స్ గురించి చాలా తక్కువ విషయాలే బయటపడ్డాయి. పెన్సిల్వేనియాలోని తన హోమ్టౌన్ వద్ద ఉన్న ఓ నర్సింగ్ హోమ్‌లో కిచన్ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. 2022లో అతను హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. క్రూక్స్ గురించి స్కూల్లో మంచి భావనే ఉన్నది. క్రూక్స్ చాలా మర్యాదగా ఉండేవాడని, చాలా బ్రైట్ స్టూడెంట్ అని టీచర్లు పేర్కొన్నారు. అయితే రాజకీయ భావాలు అతనికి ఉన్నట్లు తెలియదని వారు చెప్పారు.
రిపబ్లికన్ పార్టీ వద్ద క్రూక్స్ రిజిస్టర్ చేసుకున్నట్లు అమెరికా మీడియా పేర్కొన్నది. 2021లో యాక్ట్‌బ్లూ అనే లిబరల్ క్యాంపేన్ సంస్థకు 15 డాలర్లు విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రూక్స్ సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ఎటువంటి అభ్యంతరకర భాష ఉన్నట్లు గుర్తించలేదని ఎఫ్‌బీఐ తెలిపింది. అతనికి మానసిక సంబంధమైన సమస్యలు ఉన్నట్లు కూడా గుర్తించలేదని చెప్పింది.
అజాల్ట్ రైఫిల్ రకానికి చెందిన 556 రైఫిల్‌ను క్రూక్స్ వాడినట్లు అనుమానిస్తున్నారు. క్రూక్స్ తండ్రి ఆ రైఫిల్‌ను లీగల్‌గా కొనుగోలు చేశాడు. కానీ షూటర్ క్రూక్స్ మాత్రం స్వంతంగా ట్రంప్‌పై అటాక్‌కు ప్లాన్ వేసినట్లు తేలింది. ట్రంప్ హత్యాయత్నానికి పాల్పడిన క్రూక్స్ గురించి పూర్తి వివరాలు తెలియలేదని ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఏఆర్ స్టయిల్ 556 రైఫిల్‌తో 5.56 ఎంఎం వెడల్పు ఉండే మందుగుండును వాడే అవకాశం ఉంటుంది. క్రూక్స్‌ను హతమార్చిన ప్రదేశంలోనే ఆ రైఫిల్ ఉన్నట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు.
ట్రంప్‌ను హత్య చేయాలని ఎందుకు థామస్ మాథ్యూ క్రూక్స్ ప్లాన్ చేశాడో తెలియదని ఎఫ్‌బీఐ చెప్పింది. కానీ షూటర్ క్రూక్స్ ప్రణాళికలను స్టడీ చేస్తున్నట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. దొరికిన సాక్ష్యాల ఆధారంగా అతని గురించి తెలుసుకుంటున్నట్లు ఎఫ్‌బీఐ పేర్కొన్నది. క్రూక్స్ ఒక్కడే ట్రంప్ హత్యాయత్నానికి ప్లాన్ వేస్తున్నట్లు తెలిసినా.. ఆ ప్రయత్నం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ ఎఫ్‌బీఐ విచారణ చేపడుతోంది. గతంలో అఘాయిత్యాలకు పాల్పడినట్లు క్రూక్స్‌పై ఎటువంటి అభియోగాలు లేవు.