లండన్ : ఆలూ.. ఇది మనలో చాలా మందికి ఫేవరెట్ వెజిటబుల్..అలాంటి రోస్టెడ్ పొటాటోలను జస్ట్ టేస్ట్ చేస్తే చాలు నెలకు ఆకర్షణీయ వేతనం ఆఫర్ చేస్తామంటే ఎలా ఉంటుంది..? ఇది అత్యాశ కాదు..కలలోనే అలాంటి జాబ్స్ ఉంటాయనుకోవడానికీ లేదు.
బ్రిటన్‌లో ఓ రెస్టారెంట్ ఇలాంటి జాబ్‌ను ఆఫర్ చేస్తోంది. వారి రోస్టెడ్ పొటాటోలను టేస్ట్ చేస్తే చాలు రుచికరమైన రోస్టెడ్ పొటాటోలను లొట్టలేసుకుంటూ తినిపెట్టడంతో పాటు నెల తిరగ్గానే మీ చేతిలో రూ 50,000 (500 పౌండ్లు) జీతంగా పెట్టేస్తారు. “ మీకు అద్భుతమైన రోస్ట్‌ను ఎలా బిల్డ్ చేయాలో తెలిసి ఉంటే మీ కోసం మేము సరైన వీకెండ్ జాబ్‌ను సిద్ధంగా ఉంచాం..మా రోస్ట్‌ను అందరూ మెచ్చే విలువైన రోస్ట్గా మలిచే సత్తా ఉన్న పెయిడ్ రోస్ట్ సమీక్షకుడి కోసం తాము అన్వేషిస్తున్నా”మని రెస్టారెంట్ వెబ్సైట్లో ప్రకటన దర్శనమిచ్చింది.
ఎంపికైన అభ్యర్ధి ఆదివారం ఈనెల 19న తమ ప్రియమైన అయిదుగురితో టేస్టింగ్ సెషన్‌కు హాజరు కావాలని కోరింది. రోస్టెడ్ పొటాటోలను టేస్ట్ చేసిన అనంతరం 500 పదాలతో కూడిన సమీక్ష రాయడం లేదా సోషల్ మీడియా వేదికలపై ప్రచారం కోసం 60 సెకండ్ల క్లిప్‌ను రూపొందించాలని రెస్టారెంట్ కోరింది. తమ రివ్యూను ఏ సోషల్ మీడియా వేదికపై షేర్ చేస్తారో వారు ప్రస్తావించాలని పేర్కొంది. సెప్టెంబర్ 12లోగా అభ్యర్ధులు తమ దరఖాస్తులు సమర్పించాలని కోరింది.