
బ్రస్సెల్స్: కరోనా నేపథ్యంలో గత రెండేండ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మాస్కులు ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖాలకు మాస్కులతో సహజత్వాన్ని కోల్పోతున్నారు. అయితే, బెల్జియన్ దేశానికి చెందిన కళాకారుడు అలైన్ వెర్ష్యూరెన్, వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. మాస్క్‌కు బదులు ఔషధ మొక్కలున్న పారదర్శక గాజు బాక్స్‌ను హెల్మెట్ మాదిరిగా తలకు ధరిస్తున్నాడు. దీనికి ‘పోర్టబుల్ ఒయాసిస్’ అని పేరు పెట్టాడు.
61 ఏండ్ల బెల్జియన్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త అయిన అలైన్, 15 సంవత్సరాల కిందటే ఈ ఆలోచనకు రూపకల్పన చేశాడు. ఆయన గతంలో పనిచేసిన ట్యునీషియాలోని పచ్చని ఒయాసిస్‌ల నుండి ప్రేరణ పొందాడు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తన ఆలోచనను తిరిగి ఈ విధంగా అమలు చేస్తున్నాడు. ‘ఎడారిలో ప్రశాంతత, చల్లదనం, శ్రేయస్సు నిచ్చే ప్రదేశం ఒయాసిస్. అందుకే ఔషధ మొక్కలున్న ఒయాసిస్ను కలిగి ఉన్నాను. బయటి నుండి వచ్చే హాని నుంచి కూడా నన్ను రక్షించుకుంటున్నాను’ అని అలైన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను చాలా నిస్తేజంగా, చాలా ధ్వని లేదా దుర్వాసనతో ఉన్న ప్రపంచం నుంచి దూరంగా ఉండటానికి, నన్ను లాక్ చేయగల బబుల్‌ను సృష్టించాను’ అని పేర్కొన్నాడు.

తాను ఆస్తమాతో బాధపడుతున్నానని, దీనితో తాను ధరించే ఔషధ మొక్కల గాజు పెట్టెతో ఈజీగా శ్వాస తీసుకో గలుతున్నానని అలైన్ తెలిపాడు. తాను ఏ రోజైనా సరే మాస్కుకు బదులు దీనినే ఎంచుకుంటానని అన్నాడు. గాలి, శబ్ద కాలుష్యం నుండి మనల్ని మనం రక్షించుకోవలసిన అవసరం, మన గ్రహంపై మెరుగైన శ్రద్ధ వహించడానికి ప్రజలను ప్రేరేపించాలని తాను ఆశిస్తున్నానని చెప్పాడు. మరోవైపు మాస్కుకు బదులు అలైన్ ధరిస్తున్న ఓయాసిస్ బాక్స్ చూపరులను ఎంతో ఆకట్టుకుంటున్నది. అయితే, 2019 నుంచి ఆయన మాస్కుకు బదులు దీనిని ధరిస్తున్నప్పటికీ చాలా కొద్ది మంది మాత్రమే ఆయనను అనుకరిస్తున్నారు.
This man is wearing a ‘portable oasis’ around his head instead of a face mask 🌿 pic.twitter.com/Zjg4Yi6Uta
— NowThis (@nowthisnews) August 12, 2021