Nepal floods : నేపాల్ ఆకస్మిక వరదలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించిన సమాచారం అందరి గుండెనూ బరువెక్కేలా చేస్తోంది. నేపాల్లో వరద బాధితులు కోలుకోవాలని, వీలైనంత మంది ప్రాణాలతో బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి విషాద సమయంలో మానవత్వం చూపాల్సిన కొందరు.. ఆ మానవత్వానికే మచ్చగా నిలిచారు. వరదల్లో మరణించిన ఒక మహిళ మృతదేహాన్ని జుట్టుతో లాగి, ఆమె చెవి కమ్మలు తీసుకున్నారు.
ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపాల్లోని నారాయణి నది ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు స్పందించారు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. బుధవారం నేపాల్లో సంభవించిన వరదల్లో పలువురు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనేక మృతదేహాలు ఇతర ప్రాంతాలకూ కొట్టుకుపోయాయి. తాజాగా నారాయణి నదిలోకి పలు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. వాటిలో ఒక మహిళ మృతదేహం కూడా ఉంది.
मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j
— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026
అయితే, స్థానికుల్లో 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేష్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు ఆ మహిళ మృతదేహాన్ని నీళ్ల నుంచి ఒడ్డుకు లాగారు. అది కూడా ఆమె జుట్టు పట్టుకుని లాగారు. అనంతరం ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలు తీసుకున్నారు. ఈ ఘటనను అక్కడి వారెవరో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషాద సమయంలో మృతదేహాల విషయంలో సానుభూతి, గౌరవ ప్రదమైన వైఖరి ప్రదర్శించాల్సింది పోయి.. అవకాశవాదుల్లాగా, వారి ఒంటిపై బంగారు ఆభరణాల్ని కొట్టేయడం, జుట్టు పట్టి మృతదేహాల్ని లాగడంపై విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఇదేనా మానవత్వం అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ ఘటనపై స్తానిక చిట్వాన్ పోలీసులు స్పందించారు. నిందితులు మదన్, ఉమేష్లను పోఖారా బస్ పార్క్ వద్ద అరెస్టు చేశారు. వారివద్ద నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా మృతదేహాలపై నగలు తీసుకోవడం లేదా ఎలాంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.