వాషింగ్టన్, మార్చి 26: దాదాపు నెలరోజులుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నానన్న తన వాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పునరుద్ఘాటించారు. అయితే ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. రిపబ్లికన్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా తనను నియమించే ఆలోచనను ఆ దేశ నాయకత్వం తనకు అనధికారికంగా ప్రతిపాదించిందని, అయితే తాను వారి ప్రతిపాదనను తిరస్కరించానని ట్రంప్ అసాధారణ ప్రకటన చేశారు. ఇరాన్ దేశాధిపతి పదవిని కోరుకున్నంతగా మరే దేశాధినేత కూడా ఆ పదవిని కోరుకోవడం లేదని ట్రంప్ అన్నారు. తదుపరి సుప్రీం నాయకుడిగా తననే చేస్తామని ఇరాన్ నాయకత్వం తనను అడిగిందని, కాని తాను వద్దని చెప్పానని ఆయన తెలిపారు. గత నెల 28న యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజే ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్య జరిగిన తర్వాత ఆ స్థానంలో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ నియమితులయ్యారు.