వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ కన్నుమూశారు. క్యాథలిక్ మత పెద్ద ఎంపిక కోసం మరో రెండు వారాల్లోగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ కాంక్లేవ్‌లో కొత్త పోప్‌ను ఎన్నుకుంటారు. అయితే 140 కోట్ల మంది క్యాథలిక్ క్రైస్తవులకు లీడర్ ఎవరు కాబోతారన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. ఓ కథనం ప్రకారం కాబోయే పోప్ రేసు(Pope Successor)లో అయిదుగురి కార్డినల్స్ టాప్‌లో ఉన్నారు. వాళ్లు జాబితా ఏంటో తెలుసుకుందాం.
కార్డినల్ పీట్రో పరోలిన్. ఈయన ఇటలీ దేశస్థుడు. పోప్ ఫ్రాన్సిస్ తర్వాత రేసులో ఉన్న ఫెవరేట్ వ్యక్తిగా ఈయన్ను భావిస్తున్నారు. పోప్ సెక్రటరీగా ఉన్నారు. 70 ఏళ్ల వయసున్న ఈయనకు వాటికన్ అనుభవంగా ఉన్నది. దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయి. చైనాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలతో ఈయన అనేక సున్నితమైన చర్చలు నిర్వహించారు.
కార్డినల్ పీటర్ టర్క్సన్. ఈయది ఘనా దేశం. వాటికన్ సోషల్ జస్టిస్ సర్కిల్స్‌లో ఈయన పేరు వినిపిస్తోంది. పోప్ ఫ్రాన్సిస్ వారుసుడయ్యే అవశాలు ఉన్నట్లు బలమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఆఫ్రికాలో క్యాథలిక్‌ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆ ఖండానికి చెందిన వ్యక్తిని పోప్‌గా నియమించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. 76 ఏళ్ల వయసున్న టర్క్‌సన్‌కు.. హోమోసెక్స్, సామాజిక న్యాయం, ఎకాలజీ వంటి అంశాలపై లిబరల్ అభిప్రాయాలు ఉన్నాయి.
కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే. ఈయన పిలిప్పీన్స్ దేశస్తుడు. ఈయన వయసు 67 ఏళ్లే. మీడియా మిత్రుడు, ఉత్సాహవంతుడు అన్న పేరు ఈయనకు ఉన్నది. ఒకవేళ ఈయన పోప్‌గా ఎన్నికైతే, ఆసియా నుంచి ఎన్నికైన తొలి పోప్‌గా నిలుస్తారు. సామాజిక న్యాయంపై ఫ్రాన్సిస్ లాంటి అభిప్రాయాలు ఈయనకు ఉన్నాయి.
కార్డినల్ పీటర్ ఎర్డో. ఈయనది హంగేరి. పోప్ రేసులో ఉన్న మరో సమర్థుడు ఈయన. కన్జర్వేటివ్ అభ్యర్థి. కమ్యూనిస్టుల పాలన సమయంలో పుట్టిన ఈ 72 ఏళ్ల కార్డినల్.. చర్చి ప్రచారం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. యురోపియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ మండలి చీఫ్‌గా చేశారు. ఒకవేళ ఎర్డో ఎన్నికైతే, ఫ్రాన్సిస్ లిబరల్ విధానాలకు భిన్నంగా ఈయన వ్యవహారశైలి ఉండనున్నది.
కార్డినల్ మైకోలా బైచోక్. ఈయన యువ కార్డినల్. 45 ఏళ్ల వయసున్న ఈయన్ను గత ఏడాదే పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా చేశారు. ఉక్రెయిన్, రష్యా, అమెరికాలో చర్చి సర్వీస్‌లో పాల్గొన్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తరపున ఈయన తన వాదనలు వినిపించారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రోత్సహించిన కార్డినల్స్ లో ఈయన ఒకరు. కానీ వయసు దృష్ట్యా ఈయనకు ఛాన్స్ దొరకడం అంత సులువైన విషయం కాదు.
ప్రస్తుతం 252 మంది కార్డినల్స్ ఉన్నారు. దీంట్లో 138 మంది మాత్రమే కొత్త పోప్‌ను ఎన్నుకునేందుకు ఓటు వేస్తారు. మిగితా వారు 80 ఏళ్లు దాటడం వల్ల వాళ్లు ఓటు వేయలేరు. కానీ ఎన్నిక ప్రక్రియలో చర్చలో పాల్గొనే అవకాశం ఉంటుంది.