బీజింగ్, నవంబర్ 29: జీరో కొవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చైనీయులంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తమ చేతుల్లో తెల్ల కాగితాన్ని పట్టుకొని ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. వెంటనే చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఆంక్షలను సడలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ దేశ రాజధాని బీజింగ్ సహా షాంఘై లాంటి ప్రధాన నగరాల్లోనూ ప్రజలు, విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. తెల్ల కాగితం, ఫోన్ ఫ్లాష్‌లైట్‌ను చూపిస్తూ శాంతియుత నిరసనలు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ దిగిపో.. జిన్‌పింగ్ దిగిపో.. అంటూ నినదిస్తున్నారు. గత సెప్టెంబర్‌లో క్వారంటైన్ బస్సు ప్రమాదానికి గురై 27 మంది మృతిచెందటం, ఓ అపార్టుమెంట్లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మరణించటం వంటి ఘటనలతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు.
తెల్ల కాగితంతోనే ఎందుకు నిరసనలు
చైనాలో నిరసనలకు తావు లేదు. ఒకవేళ తలెత్తినా ఆదిలోనే అణచివేస్తారు. అందుకే.. ప్రభుత్వాన్ని, వ్యక్తులను దూషించకుండా, ఆరోపణలు చేయకుండా తెల్ల కాగితాన్ని చూపిస్తూ అక్కడి ప్రజలు తమ నిరసనలు వ్యక్తం చేస్తారు. చైనాలోని సెన్సార్షిప్ను తెలియజేసేలా ఈ తెల్ల కాగితం గుర్తుగా ఉంటుందని వారి భావన.
తెల్ల కాగితాల తొలగింపు
నిరసనలకు తెల్ల కాగితాలు వాడుతున్నారని తెలియటంతో అక్కడి సోషల్ మీడియా సంస్థలు తెల్ల కాగితాల చిత్రాలను తొలగిస్తున్నాయి. ఏకంగా.. చైనాలో ఏ4 సైజు పేపర్‌ను బ్యాన్ చేశారని వదంతులు కూడా వ్యాపించాయి. దీంతో అక్కడి ఎంఅండ్‌జీ స్టేషనరీ సంస్థ షేర్లు ఢమాల్ అన్నాయి. బ్యాన్ అంటూ ఏమీ లేదని ఆ కంపెనీ వివరణ ఇచ్చుకొన్నది.