Three Gorges Dam | బీజింగ్: చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. అయితే ఈ భారీ డ్యామ్ కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకండ్లు తగ్గిందని నాసా సైంటిస్టులు గుర్తించారు. అంతేకాదు ఈ భారీ డ్యామ్ వల్ల భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు.
‘ఐఎఫ్ఎల్ సైన్స్’ తాజా కథనం ప్రకారం, గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ సమానంగా పరుచుకుంటాయి. ఒక్కచోట ఏదైనా భారీ బరువు చేరితే..‘ఇనెర్షియా’వల్ల సదరు వస్తువు తిరిగే వేగం తగ్గుతుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్‌తో భూమిపై ఇలాంటి ప్రభావమే పడి భ్రమణ వేగం తగ్గినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఈ డ్యామ్‌లో నీటి నిల్వ కారణంగా ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్పడుతుందని వెల్లడించారు.