మనీలా, జూలై 10: పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు నేరగాళ్లు వేషాలు మార్చడం కామన్. ఫిలిప్పీన్స్‌లో మాత్రం నేరగాళ్లు తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని గుర్తుపట్టకుండా ముఖాలనే మార్చేసుకుంటున్నారు. ఇందుకోసం ఇక్కడ అక్రమ దవాఖానలు కూడా వెలిశాయి. తాజాగా రాజధాని మనీలాతో పాటు పాసే నగరంలో ఇలాంటి రెండు దవాఖానలను పోలీసులు గుర్తించారు. అక్రమంగా ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్న వియత్నాంకు చెందిన ఇద్దరు, చైనాకు చెందిన వైద్యుడిని అరెస్టు చేశారు. నేరగాళ్ల ముఖాన్ని వీటిల్లో పూర్తిగా మార్చేస్తున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు. కొత్త దంతాలు అమర్చుతున్నారు. చర్మం కూడా తెల్లగా మార్చేందుకు అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. వివిధ నేరాలకు పాల్పడి తప్పించుకున్న వారు, అక్రమంగా ఆన్లైన్ క్యాసినోలు, జూదం నిర్వహించే వారు వీటిల్లో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారని పోలీసులు చెప్తున్నారు.
న్యూయార్క్, జూలై 10: అమెరికాలోని ఓ కోర్టులో నేరస్థుడు, బాధితుడి మధ్య రాజీ కోసం ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన వచ్చింది. పరిశోధనలకు తన మెదడును ఇచ్చేందుకు ఓ నేరస్థుడు కోర్టులో అంగీకరించాడు. ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్ ప్రాంతంలోని మర్జోరీ స్టోన్మాన్ డగ్లస్ హై స్కూల్లో 2018 ఫిబ్రవరి 14న నికోలస్ క్రూజ్ అనే వ్యక్తి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు, పాఠశాల సిబ్బంది మరణించారు. నికోలస్ క్రూజ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడటంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడు. ఈ ఘటనలో ఆంటోని బోర్గస్(21) అనే వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుండగా బాధితుడు ఆంటోని బోర్గస్ తరపు న్యాయవాది అలెక్ట్ అర్రేజా ఒక ప్రతిపాదన చేశాడు. 17 మంది మరణానికి కారణమైన నికోలస్ మెదడులో ఏదో సమస్య ఉండొచ్చని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు అదేంటో శాస్త్రవేత్తలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను పరిశోధనకు తన మెదడు ఇచ్చేందుకు నికోలస్ అంగీకరించాడు.