Ebrahim Raisi | దుబాయ్, మే 19: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు ఆ దేశ అధికారిక మీడియా ఆదివారం ప్రకటించింది. అజర్బైజాన్ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన అధ్యక్షుడు, తిరుగు ప్రయాణంలో తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా ఆయన వెళ్తున్న హెలికాప్టర్ కూలినట్టు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. భారీ పొగమంచు మధ్య పర్వతప్రాంతాలను దాటుతుండగా హెలికాప్టర్ కుప్పకూలిందని ఇరాన్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అధ్యక్షుడి కాన్వాయ్‌లోని మరో రెండు హెలికాప్టర్లు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకున్నాయని, అధ్యక్షుడు రైసీ సహా ఇతరులు క్షేమంగా ఉన్నారన్నదానిపై అనుమానాలున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది.
‘ఘటనాస్థలం నుంచి వస్తున్న సమాచారం అత్యంత ఆందోళనకరంగా ఉంది’ అని స్థానిక అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ప్రమాద ఘటన చోటుచేసుకుందని మీడియా వెల్లడించింది. హెలికాప్టర్లో అధ్యక్షుడు రైసీతోపాటు విదేశాంగ మంత్రి అబ్దొల్లాహియాన్, అజర్ బైజాన్ గవర్నర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలిసింది. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని, భారీ వర్షం, మంచు కురవటంతో సహాయక చర్యలు ముందుకు కదలటం లేదని ఇరాన్ హోంమంత్రి వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెగ్యులర్ టీవీ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం నిలిపివేసింది.
ఇరాన్లో మతతత్వ పాలనకు గట్టి మద్దతుదారుగా రైసీ నిలిచారు. ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు, ఆయనకు వారసుడిగా రైసీ గుర్తింపు పొందారు. 1988లో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు అమెరికా, ఇతర దేశాల నుంచి ఆయన ఆంక్షల్ని ఎదుర్కొంటున్నారు. గతంలో ఇరాన్ న్యాయవ్యవస్థను నడిపారు. 2021 అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థులందర్నీ పక్కకు తప్పించి, తక్కువ ఓటింగ్‌తో రైసీ గెలుపొందటం వివాదాస్పదమైంది. అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో నైతిక చట్టాల్ని కఠినతరం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేశారు.