టొరంటో, ఏప్రిల్ 29: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తూ మరోసారి అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతున్నది. కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో 343 సీట్లుండగా అధికారం చేపట్టాలంటే 172 సీట్లు రావాలి. ఓట్ల లెక్కింపు నిలిపివేసే నాటికి అధికార లిబరల్స్ 168 సీట్లలో గెలుపు/ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి మెజారిటీకి వారు ఇంకా నాలుగు సీట్ల దూరంలో ఉన్నారు. 144 సీట్లతో కన్జర్వేటివ్ పార్టీ వారిని అనుసరించింది.
ఖలిస్థాన్ అనుకూలుడైన జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ కేవలం 4-7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కార్నీ పార్టీ గెలవడం, జగ్మీత్ సింగ్ ఓడటం భారత్‌కు శుభవార్తేనని చెప్చవచ్చు. ఎందుకంటే ఇటీవల దెబ్బతిన్న రెండు దేశాల దౌత్య సంబంధాలు ఈ ఎన్నికల ఫలితాల అనంతరం పునరుద్ధరణకు అవకాశాలు ఉన్నాయి.