ISS | లండన్, నవంబర్ 1: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రమాదం పొంచి ఉందా? పెరుగుతున్న లీక్‌తో వ్యోమగాముల ప్రాణాలు ప్రమాదంలో పడనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని లీక్‌ను గుర్తించడంలో, సరిచేయడంలో నాసా, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ విఫలమవుతుండటం ఆందోళనకు దారి తీస్తున్నది. ఐఎస్ఎస్లో పెరుగుతున్న లీక్‌ను ‘ప్రధాన భద్రతా ముప్పు’గా నాసా సైతం తాజాగా పేర్కొన్నది. మరోవైపు ఐఎస్ఎస్ను వెంటనే ఖాళీ చేయకపోతే ప్రాణాంతక విపత్తుకు దారి తీయొచ్చని బ్రిటన్‌కు చెందిన నిక్ పోప్ అనే అంతరిక్ష నిపుణుడు హెచ్చరించారు. నాసా వేచి చూసే ధోరణితో ముప్పు ముంచుకొస్తున్నదని, ఇది వ్యోమగాముల ప్రాణాలతో పాటు, నాసా ప్రతిష్ఠను సైతం అంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రష్యా జ్వెజ్ద సర్వీస్ మాడ్యూల్ ట్రాన్స్ఫర్ టన్నెల్లో 2019లో ఒక లీక్‌ను వ్యోమగాములు గుర్తించారు. దీనిని అంతరిక్ష సంస్థలు పలుమార్లు మరమ్మతు చేసినప్పటికీ లీక్ కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల ఇది మరింత పెరిగింది. దీంతో మొదట రోజుకు 0.09 కేజీల గాలి లీక్ అయ్యేది. ఇది ఫిబ్రవరిలో 1.08 కిలోలకు పెరిగిందని, ఏప్రిల్ నాటికి 1.68 కిలోలకు పెరిగిందని నాసా ప్రకటించింది. లీకేజీ ఇలాగే కొనసాగితే అంతరిక్ష కేంద్రం వేగంగా ఒత్తిడిని, ఆక్సిజన్‌ను కోల్పోతుంది. లీకేజీ పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లో ఈ సమస్యను ‘ప్రధాన భద్రతా ముప్పు’గా నాసా ప్రకటించింది. అవసరమైనప్పుడు మాత్రమే లీకేజీ ఉన్న మాడ్యూల్‌కు ప్రవేశమార్గాన్ని(హాచ్) తెరవాలని, మిగతా సమయాల్లో మూసివేయాలని రోస్కోమోస్తో నాసా ఒక ఒప్పందానికి వచ్చింది. హాచ్ తెరిచినప్పుడు ఐఎస్ఎస్లోని అమెరికా వైపు ఉండాలని వ్యోమగాములకు నాసా సూచించింది. తద్వారా ఏదైనా అత్యవసర స్థితి వస్తే వ్యోమనౌకలోకి త్వరగా చేరుకోవచ్చని చెప్పింది.
ఐఎస్ఎస్కు కాలం చెల్లిన నేపథ్యంలో 2031 కల్లా డీకమిషన్ చేయాలని నాసా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగా అత్యవసర పరిస్థితి వస్తే బోయింగ్ స్టార్‌లైనర్‌లో వెళ్లి చిక్కుకున్న ఇద్దరు సహా ఐఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాములను నాసా వెంటనే వెనక్కు తీసుకురావాల్సి వస్తుంది. ఇందుకోసం నాసా వద్ద ప్రణాళిక ఉంది. స్పేస్ఎక్స్ డ్రాగన్, రష్యాకు చెందిన సుయోజ్తో పాటు స్పేస్ కాప్సూల్స్ ద్వారా వ్యోమగాములను వెనక్కు తీసుకురావాలి. వీటిల్లో ఎమర్జెన్సీ సూట్లు కూడా ఉన్నాయి. అయితే, అంతరిక్ష శిథిలాలు తాకి ఈ కాప్సూల్స్ విఫలమయ్యే పరిస్థితులు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనట్టు నాసా అంగీకరించింది. ఇది వ్యోమగాముల ప్రాణాలకు ముప్పు తేవచ్చు. కాగా, నాసా మాత్రం మరికొన్నాళ్లు వ్యోమగాములను ఐఎస్ఎస్లోనే ఉంచనున్నట్టు స్పష్టం చేస్తున్నది.