వాషింగ్టన్, ఆగస్టు 5: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో.. గంటకు 29 వేల కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఫుట్‌బాల్ స్టేడియం సైజులో ఉన్న ఓ భారీ నిర్మాణం ఉన్నట్టుండి ఉల్టా-పల్టా అయితే ఎలా ఉంటుంది? అందులో ఉన్న వారి పరిస్థితి ఏమిటి? ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తున్నది కదూ! వారంక్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్).. రష్యా స్పేస్ మాడ్యుల్ ‘నావుకా’ అనుసంధానమైన సమయంలో సరిగ్గా ఇదే జరిగింది. నావుకా ఇంజిన్ అకస్మాత్తుగా మండటంతో జెట్ థ్రస్టర్ల ఒత్తిడికి ఐఎస్ఎస్ 45 డిగ్రీల మేర కొద్దిగా ఒకవైపునకు ఒరిగినట్టు నాసా పరిశోధకులు ప్రకటించారు. అయితే, 45 డిగ్రీలు కాదు.. ఏకంగా 540 డిగ్రీల మేర ఐఎస్ఎస్ పల్టీలు కొట్టినట్టు న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. అంటే నావుకా కారణంగా.. ఐఎస్ఎస్ ఒక పూర్తిస్థాయి భ్రమణం చేసి (360 డిగ్రీలు).. అనంతరం తలకిందులుగా (180 డిగ్రీలు) మారినట్టు అందులో పేర్కొంది. దీన్ని గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు ఐఎస్ఎస్ మరోపక్క ఉన్న మాడ్యుల్‌ను మండించి యథాస్థితికి తీసుకొచ్చినట్టు వెల్లడించింది. అయితే, ఈ ఘటనలో మాడ్యుల్లో ఉన్న ఏడుగురితో పాటు ఐఎస్ఎస్లో ఉన్నవారికి ఏమీ జరుగలేదని వివరించింది.