హేగ్, నవంబర్ 21 : ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయనతో పాటు ఇజ్రాయెల్ మాజీ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లెంట్, హమాస్ అధికారులపైనా గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. గాజాలో చేస్తున్న యుద్ధంలో యుద్ధనేరాలకు, మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నెతన్యాహూ, గల్లెంట్పై, 2023 అక్టోబరులో ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడినందున హమాస్ అధికారులపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కాగా, అరెస్టు వారెంట్లు జారీ చేసినప్పటికి, వాటిని అమలు చేసేందుకు ఐసీసీకి ప్రత్యేక పోలీసు వ్యవస్థ లేదు. దీంతో నెతన్యాహూ, గల్లెంట్ కోర్టు ముందు హాజరయ్యే అవకాశం లేదు. ఐసీసీ నిర్ణయాన్ని నెతన్యాహూ ఖండిస్తూ, అసంబద్ధమైన, అబద్ధపు ఆరోపణలను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. గాజాలో యుద్ధానికి మించి ఏమీ జరగలేదని ఆయన కార్యాలయం పేర్కొంది.