బుధవారం 03 జూన్ 2020
International - Apr 23, 2020 , 02:47:39

వలసల నిషేధం అరవై రోజులే

వలసల నిషేధం అరవై రోజులే

  • స్పష్టత ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 
  • 2 నెలలపాటు గ్రీన్‌కార్డుల జారీ నిలిపివేత 
  • హెచ్‌-1బీ వీసాలకు భారీ ఊరట 

వాషింగ్టన్‌: అమెరికాలోకి వలసలను నిషేధిస్తామంటూ సంచలన ప్రకటన చేసిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. బుధవారం నిషేధ కాలపరిమితపై స్పష్టత ఇచ్చారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం మంజూరుచేసే గ్రీన్‌ కార్డుల జారీని 60 రోజులపాటు నిలిపివేయనున్నట్టు చెప్పారు. ‘కరోనా నేపథ్యంలో అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. తిరిగి సాధారణ జీవితం నెలకొల్పాల్సి ఉన్నది. ఈ మేరకు పరిశ్రమలు, సంస్థలు తిరిగి తెరుచుకున్న తర్వాత స్థానికులే ముందు వరుసలో ఉండాలి. వారి స్థానంలో వలసదారులను చేర్చుకోవడం అంటే.. స్థానికులకు అన్యాయం చేసినవారం అవుతాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని ట్రంప్‌ వెల్లడించారు. ఈ మేరకు గ్రీన్‌కార్డుల జారీని రెండు నెలలపాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ముసాయిదా తయారుచేస్తున్నామని, కొన్ని మినహాయింపులు కూడా ఉండొచ్చన్నారు. అయితే అవేమిటో మాత్రం వెల్లడించలేదు. వైద్యసిబ్బంది, ఆహార సరఫరా విభాగంలో పనిచేస్తున్నవారికి మినహాయింపు ఇవ్వొచ్చని తెలుస్తున్నది. కాగా, కేవలం గ్రీన్‌ కార్డుల జారీని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించడంతో లక్షల మంది హెచ్‌-1బీ వీసాదారులు ఊపిరిపీల్చుకున్నారు. ఉద్యోగ వీసాల జారీ ప్రక్రియను ఎక్కడ నిలిపివేస్తారోనని వీరంతా ఆందోళనకు గురయ్యారు. వ్యవసాయ పనుల కోసం సీజన్లవారీగా వచ్చే వలస కార్మికులపైనా ఎలాంటి ప్రభావం ఉండబోదు.

హెచ్‌1బీ వీసాదారులకు ఇబ్బందే

  • టీడీఎఫ్‌ మాజీ అధ్యక్షుడు విశ్వేశ్వర్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అమెరికాలో ప్రవాస తెలంగాణీయులకు ప్రస్తుతానికి నిరుద్యోగ సమస్య లేకపోయినా నెలరోజుల తర్వాత సమస్య ఉత్పన్నమయ్యే అవకాశమున్నదని అమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) మాజీ అధ్యక్షుడు విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. కరోనా తీవ్రత పెరిగిన గత నెల రోజుల్లోనే అమెరికన్లు 2.20 కోట్ల మంది నిరుద్యోగ భృతికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, దీని వల్ల భవిష్యత్తులో హెచ్‌1బీ వీసాదారులకు ఇబ్బంది ఏర్పడవచ్చని ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. 


logo