ఢాకా, డిసెంబర్ 19: మన పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి, తిరుగుబాటు నాయకుడు, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే షరీఫ్ ఉస్మాన్ హాది (32) మరణించడంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు గురు, శుక్రవారాల్లో దేశంలో పలుచోట్ల నిరసనలు చేపట్టడంతో హింస, విధ్వంసం చోటు చేసుకుంది. అల్లర్లలో ఒక హిందువు హత్యకు గురి కాగా, పలువురు నిరసనకారులు, పౌరులు గాయపడ్డారు. ఢాకాలో బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ గృహమైన 32 ధన్‌మండీ భవనాన్ని ఆందోళనకారులు కూల్చివేశారు. రాత్రి నిరసనకారులు రాజాషాహీలోని అవామీ లీగ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
రెండు మీడియా సంస్థలకు నిప్పు పెట్టారు. జతియా ఛత్ర శక్తి విద్యార్థి సంఘం యూనివర్సిటీ క్యాంపస్‌లో సంతాప ప్రదర్శన చేసిన అనంతరం షాన్‌బాగ్ కూడలికి చేరుకుని ఆందోళనలో పాల్గొంది. చిట్టగాంగ్‌లోని భారత సహాయ ఇండియన్ హై కమిషనర్ నివాస గృహంపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేయడమే కాక, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే రెండు పత్రికా కార్యాలయాలకు సిబ్బందిని నిర్బంధించారు. దీంతో బంగ్లాదేశ్‌లోని భారత హై కమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఉస్మాన్ హాది మరణాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనిస్ గురువారం రాత్రి నిర్ధారించారు.
మెమెన్సింగ్ జిల్లాలో ఒక హిందువును గురువారం రాత్రి కొందరు దుండగులు సజీవ దహనం చేశారు. భలుకా ఉపాజిలా పరిధిలోని దుబాలియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీపూ అనే వ్యక్తి ఓ ప్రవక్తను దూషించాడని ఆరోపిస్తూ దాడి చేసిన మూక అతడిని ఒక చెట్టుకు కట్టేసి చిత్ర హింస పెట్టి చంపింది. అనంతరం అతడి మృతదేహానికి నిప్పంటించారు.