లండన్, ఫిబ్రవరి 21: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాల వ్యవహారం యూకే పార్లమెంట్‌కు చేరింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో ఈ విషయాన్ని పలువురు ఎంపీలు లేవనెత్తారు. ఐటీ సోదాలు, భారత్‌లో భావప్రకటనా స్వేచ్ఛపై బ్రిటన్ ప్రభుత్వ వైఖరి ఏంటని ప్రశ్నించారు. ఎంపీల ప్రశ్నలపై పార్లమెంటరీ అండర్ సెక్రటరీ డెవిడ్ రుట్లే స్పందించారు. తాము బీబీసీకి అండగా నిలబడతామని ఆయన పేర్కొన్నారు. బీబీసీకి ప్రభుత్వం నిధులు ఇస్తున్నదని, బీబీసీ వరల్డ్ సర్వీస్ తమకు ముఖ్యమైనదని తెలిపారు. బీబీసీకి పత్రికా స్వేచ్ఛ ఉండాలని యూకే ప్రభుత్వం కోరుకుంటున్నదని పేర్కొన్నారు.