న్యూయార్క్, జనవరి 28: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చంద్రుడిపై వ్యోమగాములను పంపేందుకు ఆర్టెమిస్ -3 మిషన్‌ను 2026లో ప్రయోగిస్తామని ప్రకటించింది. 1972లో అపోలో 17 తర్వాత ఈ మిషన్ ద్వారానే మనుషులను జాబిల్లిపైకి పంపేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం నాసాకు సవాల్‌గా మారింది.
చంద్రుడు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాడని, దక్షిణ ధ్రువంపై ప్రకంపనాల వల్ల ఉపరితలం పూర్తిగా గుంతలమయంగా తయారైందని పరిశోధకులు తేల్చారు. ఆర్టెమిస్‌ను నాసా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దించాలని ప్రణాళిక రచించిందని, అయితే చంద్రుడిపై ప్రకంపనల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయని, ఇక్కడ చాలా భాగం సేఫ్ల్యాండింగ్కు అనుకూలంగా లేదని అధ్యయనంలో తేలింది. చంద్రుడిపై జరుగుతున్న ఈ పరిణామాలు భవిష్యత్తులో వ్యోమగాములకు సమస్యలు తెచ్చిపెడతాయని హెచ్చరించింది.