థాయిల్యాండ్: థాయిల్యాండ్ ప్రధాని పెటంగటార్న్ షినవత్రా(Paetongtarn Shinawatra)పై వేటు వేశారు. ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఇవాళ ఆ సస్పెన్షన్ విధించింది. పొరుగు దేశం కంబోడియాతో జరిగిన ఫోన్ సంభాషణ కేసులో విచారణ చేపట్టిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పిస్తూ రాజ్యాంగ కోర్టు 7-2 తేడాతో తీర్పును వెలువరించింది. జూలై ఒకటో తేదీ నుంచి ప్రధాని షినవత్రా సస్పెన్షన్ అమలులోకి రానున్నది. కంబోడియాతో బోర్డర్ చర్చలు నిర్వహిస్తున్న వేళ.. షినవత్రా తన విలువలు మరిచినట్లు కన్జర్వేటివ్ సేనేటర్లు ఆరోపించారు.
ప్రధాని ప్రవర్తన వల్లే బోర్డర్ సమస్య మరింత జఠిలమైందని, దాని వల్ల మే నెలలో సీమాంతర ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సేనేటర్లు ఆరోపించారు. ఆ ఘర్షణల్లో ఓ కంబోడియా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. చర్చలకు చెందిన ఫోన్ కాల్ లీక్ కావడంతో షినవత్రాపై ఆరోపణలు నమోదు అయ్యాయి. కంబోడియా రాజకీయవేత్తను అంకుల్ అని సంబోధించడం.. మిలిటరీ కమాండర్‌ను ప్రత్యర్థిగా భావిస్తూ కామెంట్ చేసినట్లు షినవత్రాపై ఆరోపణలు ఉన్నాయి.
రాజ్యాంగ తీర్పును సవాల్ చేస్తూ మరో 15 రోజుల్లోగా ప్రధాని షినవత్రా తన వాదనలను వినిపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆమె కేసును డిస్మిస్ చేస్తారు. ఈ సమయంలో తాత్కాలిక దేశ ప్రధానిగా.. డిప్యూటీ పీఎం సురియా జున్‌గ్రున్‌గ్రుంగిట్ విధులు నిర్వర్తించనున్నారు. ఒకవేళ పెటంగటార్న్ షినవత్రాను డిస్మిస్ చేస్తే, ప్రధాని బాధ్యతల నుంచి సస్పెండ్ అయిన రెండో వ్యక్తిగా ఆమె నిలుస్తారు.