న్యూఢిల్లీ: అమెరికాలో జరిగిన సెప్టెంబర్ లెవన్ దాడుల్లో కీలక సూత్రధారి అయిన ఆల్‌ఖయిదా వ్యవస్థాపకుడు ఒసామా బెన్ లాడెన్ తప్పించుకునే క్రమంలో ఆడవేషంలో పరారీ అయినట్లు మాజీ సీఐఏ ఆఫీసర్(Ex CIA Officer ) జాన్ కిరియాకౌ తెలిపారు. తోరా బోరా గుహల నుంచి ఒసామా బిన్ లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నట్లు ఆయన చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. జాన్ రికియాకౌ సీఐఏలో 15 ఏళ్ల పాటు సేవలందించారు. పాకిస్థాన్‌లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ నిర్వహించారు. 2001, సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాపై ఆల్ ఖయిదా దాడి చేసిన విషయం తెలిసిందే. విమానాలతో డబ్ల్యూటీసీ ట్విన్ టవర్స్‌ను పేల్చేశారు.
ఆ ఘటన తర్వాత లాడెన్ కోసం అమెరికా వేట ప్రారంభించింది. నెల రోజుల తర్వాత తోరాబోరా గుహల్లో లాడెన్ ఉన్నట్లు గుర్తించామని మాజీ సీఐఏ అధికారి తెలిపారు. సెంట్రల్ కమాండ్ లో పనిచేస్తున్న ట్రాన్స్‌లేటర్ వాస్తవానికి ఓ ఆల్‌ఖయిదా వ్యక్తిని అని ఆలస్యంగా గుర్తించామన్నారు. గుహల నుంచి బయటకు రావాలని లాడెన్‌కు వార్నింగ్ ఇచ్చామని, కానీ వాళ్లు సాయంత్రం వరకు టైం అడిగారన్నారు. మహిళలు, పిల్లలను బయటకు పంపేందుకు ఆ సమయం కావాలన్నారు. ఆ ఐడియాకు ఓకే చెప్పాలని ట్రాన్స్‌లేటర్ ఒప్పించినట్లు తెలిపారు.
అయితే మారువేషంలో ఆడ దుస్తులు ధరించిన బిన్ లాడెన్ అక్కడ నుంచి ఆ చీకట్లో పాకిస్థాన్‌కు పరారీ అయినట్లు సీఐఏ ఆఫీసర్ తెలిపారు. తెల్లవారేసరికి ఆఫ్ఘన్ గుహల్లో ఎవరూ లేరని, వాళ్లంతా పరారీ అయ్యారని, అందు వల్లే తమ పోరాటాన్ని పాకిస్థాన్‌కు తరలించాల్సి వచ్చిందన్నారు. అయితే మే 2011లో ఒసామా బిన్ లాడెన్‌ను అబోటాబాద్‌లో గుర్తించారు. అమెరికా ప్రత్యేక దళాలు అతన్ని తుదముట్టించాయి.