Benjamin Netanyahu : ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red fort) సమీపంలో కారులో భారీ పేలుడు సంభవించిన ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM) బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో భారత్కు, ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
బుధవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా నెతన్యాహు స్పందించారు. ప్రియ మిత్రుడు నరేంద్ర మోదీకి, ధైర్యవంతులైన భారత ప్రజలకు తాను, తన భార్య సారాతోపాటు ఇజ్రాయెల్ ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఇజ్రాయెల్ మీకు అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. భారత్, ఇజ్రాయెల్ ప్రాచీన నాగరికతలకు నిదర్శనాలని, శాశ్వత సత్యాలపై నిలబడినవని పేర్కొన్నారు.
‘ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయగలదేమోగానీ, మన ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ కదిలించలేదు. మన దేశాల వెలుగు శత్రువుల చీకటిని మించి ప్రకాశిస్తుంది’ అని నెతన్యాహు సందేశం పంపారు. అదేవిధంగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ కూడా ఈ దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.