Protests : లండన్ నగరం (Landon city) శనివారం ఉద్రిక్తతలకు వేదికగా మారింది. వేలమంది నగర వీధుల్లోకి వచ్చి తమ నిరసనల (Protests) ను తెలియజేశారు. ఒకవైపు వలసదారులపై వ్యతిరేకతను వ్యక్తంచేస్తూ ఆందోళనలు జరుగగా.. మరోవైపు జాత్యహంకారాన్ని ఖండిస్తూ ‘స్టాండప్ టు రేసిజమ్’ అనే నినాదంతో మరో ర్యాలీ జరిగింది. ఈ రెండు ర్యాలీల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు భారీఎత్తున మోహరించారు. అయినప్పటికీ ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.
లండన్ వీధుల్లో వలసదారుల వ్యతిరేక ర్యాలీలో వేలమంది పాల్గొన్నారు. వలసలవల్ల తమ దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నిరసనకారులు తమ డిమాండ్లను గట్టిగా వినిపించడానికి నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నగరంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ తీశారు. కానీ ఈ ర్యాలీలో కొంతమంది నిరసనకారులు హద్దులు దాటడంతో హింసాత్మకంగా మారింది. పోలీసులపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు 26 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అదే సమయంలో నగరంలో మరో నిరసన ర్యాలీ కూడా జరిగింది. స్టాండ్ అప్ టు రేసిజమ్ అనే సంస్థ నాయకత్వంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా 5 వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. సమాజంలో సమానత్వం, ఐక్యతను ప్రోత్సహించాలని నిరసనకారులు కోరారు. వివిధ జాతులు, సంస్కృతుల ప్రజలు ఒకే దేశంలో సామరస్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేశారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని, నినాదాలు చేస్తూ, జాత్యహంకార వివక్షను ఖండిస్తూ ముందుకు నడిచారు.