వాషింగ్టన్: టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ 185 మంది ఉద్యోగులను తొలగించింది. నిధుల దుర్వినియోగం చేసి జీతాల్లో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై కాలిఫోర్నియా కుపెర్టినో హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న వీరిని విధుల నుంచి తొలగించారు. వీరిలో ఆరుగురిపై కేసులు కూడా నమోదయ్యాయి. తొలగింపునకు గురైన ఉద్యోగులలో పలువురు భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు కూడా ఉన్నారు. అయితే ఉద్యోగుల తొలగింపుపై యాపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉద్యోగుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు వారు లాభేతర సంస్థల సేవాకార్యక్రమాలకు సొమ్ములు విరాళంగా ఇచ్చేందుకు సంస్థ ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది.
ఇందులో భాగంగా ఉద్యోగులు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తే.. యాపిల్ సంస్థ కొంత మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఆ సంస్థకు విరాళంగా ఇస్తుంది. ఇక్కడే ఉద్యోగులు అవినీతికి తెరలేపారు. వారు ఆయా సంస్థలతో చీకటి ఒప్పందం చేసుకునే వారు. దీని ప్రకారం విరాళాలు తీసుకున్న సంస్థలు ఆ ఉద్యోగులకు వారు ఇచ్చిన విరాళాన్ని వెనక్కి ఇచ్చేయడమే కాక, యాపిల్ చెల్లించిన మ్యాచింగ్ గ్రాంట్‌లో కొంత శాతం కమీషన్ ఇచ్చేవి.