Artificial Intelligence | న్యూయార్క్, ఫిబ్రవరి 10: సాఫ్ట్వేర్ ఉద్యోగుల కొలువులకు ఇక దినదిన గండమేనా? టెక్ ఉద్యోగుల స్థానాన్ని ఏఐ ఆక్రమించేస్తుందా? ఇంతకాలం డ్రీమ్ జాబ్‌గా ఉన్న ఐటీ ఉద్యోగం డేంజర్ జోన్లో పడ్డట్టేనా? ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చేసిన ఒక ప్రకటన ఈ అనుమానాలు మరింత బలపరుస్తున్నది. చాట్‌జీపీటీతో ఏఐ రంగంలో సంచలనం సృష్టించిన ఓపెన్ఏఐ భవిష్యత్ ప్రణాళికల గురించి శామ్ ఆల్ట్‌మన్ తన తాజా బ్లాగ్ పోస్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు.
త్వరలో తమ సంస్థ ఏఐ ఏజెంట్లను అందుబాటులోకి తీసుకురానున్నదని, కొన్ని సంవత్సరాల అనుభవం కలిగిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు చేసే పనిని ఈ ఏఐ ఏజెంట్లు చేసేస్తాయని ప్రకటించారు. కోడింగ్, డెవెలప్మెంట్ పనుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు వర్చువల్ సహోద్యోగులుగా ఏఐ ఏజెంట్లు పని చేయనున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో ఊహలకందని స్థాయిలో వివిధ రంగాల్లో ఏఐ ఏజెంట్లు విస్తరిస్తాయని, ఏఐ ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు. అయితే, ఆర్థిక అసమానతలకు ఇది దారితీయొచ్చని అభిప్రాయపడ్డారు.
ఏఐ ఏజెంట్లతో పెద్ద సంఖ్యలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొలువులకు కోత పడే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ దిగ్గజ సంస్థలు ఏఐ వినియోగాన్ని పెంచాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు గానూ కోడ్ రాసే మధ్య స్థాయి ఇంజినీర్లను ఏఐతో భర్తీ చేసే ఆలోచనలు ఉన్నట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బెర్గ్ ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు గూగుల్‌లో దాదాపు 25 శాతం కోడ్‌ను ఏఐ రాస్తున్నట్టు ఇటీవల ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. అయితే, ఏఐ రాసిన కోడ్‌ను చివరగా ఇంజినీర్లు పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు చేసే పనిని ఏఐ ఏజెంట్లు చేసినప్పటికీ, ఇవి కొత్త ఆలోచనలు చేయలేవని, వీటి పనిని మనుషులు పర్యవేక్షించాల్సి ఉంటుందని ఆల్ట్‌మన్ చెప్పారు. ఏఐతో సాఫ్ట్వేర్ ఉద్యోగాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని వీరి మాటలు పరోక్షంగా చెప్తున్నాయి. ఇదే సమయంలో కోడింగ్‌తో పాటు ఏఐ నైపుణ్యాలు కలిగిన వారి ఉద్యోగాలకు మాత్రం ముప్పు ఉండకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు.