బాల్టిమోర్: అమెరికాలోని ఎకోమ్యాప్ టెక్నాలజీ కంపెనీ సీఈవో పావా లాపేరీ(CEO Pava LaPere) హత్యకు గురైంది. ఫోర్బ్స్ 30 జాబితాలో ఉన్న ఆ 26 ఏళ్ల సీఈవో అనుమానాస్పద రీతిలో తన అపార్ట్మెంట్లో మృతిచెందారు. బాల్టిమోర్ సమీపంలో ఉన్న మౌంట్ వెర్నాన్లో ఆమె నివాసం ఉంది. ఈ కేసులో 32 ఏళ్ల జేసన్ డీన్ బిల్లింగ్స్లే అనే వ్యక్తి అనుమానిత నిందితుడిగా ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీఈవో పావా తలకు బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ హత్య కేసులో ఉన్న అనుమానితుడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని, అతడు ఎంతకైనా తెగిస్తాడని, రేప్ కూడా చేస్తాడని పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు. లాపేరికి చెందిన టెక్ కంపెనీ ఆమె మృతి పట్ల ప్రకటన చేసింది. చాలా విషాదకరమైన రీతిలో ఆమె మృతిచెందినట్లు పేర్కొన్నది. ఎకోమ్యాప్ సంస్థ తన ఎక్స్ అకౌంట్లో నివాళి అర్పించింది.
కంపెనీ స్థాపనలో ఆమె విజన్ ఎంతో ఉందన్నారు. ఫోర్బ్స్లో ’30 అండర్ 30′ జాబితాలో ఇటీవల ఆమె పేరు నమోదు అయ్యింది. సామాజిక ప్రభావం చూపిన స్టార్టప్ కంపెనీ సీఈవోగా ఆమె ఆ జాబితాలో చేరారు.